హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు వస్తున్న ఆదరణతో బెంబేలెత్తిపోయిన ఈటల రాజేందర్ తాజాగా దళితులను రెచ్చగొట్టి సొమ్ము చేసుకొనేందుకు కుయుక్తులు పన్నుతున్నట్టు తేలిపోయింది. బీజేపీ జెండా, ఈటల బొమ్మ ఉంటుంది. కానీ వాహనం మాత్రం నీలిరంగులో ఉంటుంది. ఎక్కడా బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకుల ముఖాలు మచ్చుకు కూడా కనిపించవు. ఈ వాహనాలను బుధవారమే రంగంలోకి దింపారు.
బుధవారం సాయంత్రం శంభునిపల్లి గ్రామానికి రంగుమార్చుకొన్న ప్రచార రథాలు చేరుకొన్నాయి. వాడవాడల్లో తిరుగుతూ.. దళితబంధు ఈటల రాజేందర్ వల్లనే వచ్చిందని ప్రచారం మొదలుపెట్టారు. మరోవాడలో నలుగురైదుగురికి మాత్రమే ఇస్తారని.. ఎవ్వరికీ ఇవ్వరంటూ చెప్పారు. ప్రభుత్వంపై తిరగబడాలని రెచ్చగొట్టే యత్నంచేశారు. ఈ తప్పుడు ప్రచారాన్ని దళితులు అడ్డుకొన్నారు. వారికి అండగా శంభునిపల్లి గ్రామ టీఆర్‌ఎస్ శాఖ అధ్యక్షుడు రాసపెల్లి సదానందం, నాయకులు కొత్తూరి రమేశ్, మారపెల్లి ప్రవీణ్, రాసపెల్లి సంపత్, రాజు, అఖిల్, సిరికొండ రమేశ్, కొత్తూరి సారయ్య నిలిచారు.
ఓట్లు అడగండి.. కానీ, రెచ్చగొట్టవద్దని హితవుచెప్పారు. కానీ వాహనాల్లోని వ్యక్తులు తగ్గకపోవడంతో దళితులు ప్రచారానికి అడ్డంగా నిలబడ్డారు. వ్యతిరేక నినాదాలు చేశారు. తాము కూడా దళితులమేనని ఈటల వర్గీయులు చెప్పడానికి ప్రయత్నించారు. దళితులే అయితే చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తారా? వెళ్లకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సమయంలోనే ఈటల అనుచరులు వాహనాలు సహా జారుకొన్నారు. వాహనాలు వెళ్లుతున్నంతసేపు ‘జై తెలంగాణ.. జై కేసీఆర్.. దళిత బంధువు కేసీఆర్..’అంటూ దళితబిడ్డలు నినాదాలు చేశారు.