ఎంతో అన్యాయం జరిగిపోతున్నదని.. ఏదో రాజకీయం చేద్దామని సీఎం దత్తత గ్రామాలకు తగుదునమ్మా అని వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి శృంగభంగమైంది. రాజకీయాలకు అతీతంగా సమైక్యంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు రేపడానికి వచ్చారా? అంటూ స్థానికుల నుంచి నిరసనలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పటివరకు ముఖ్యమంత్రులు గ్రామాలను దత్తత తీసుకొన్నట్టు ప్రకటించడమే తప్ప.. తమ హయాంలో ఒక్కసారి కూడా ఆయా గ్రామాలకు వెళ్లిన దాఖలా కనిపించదు.
కానీ దత్తత తీసుకొన్న గ్రామాలకు స్వయంగా వెళ్లి.. అక్కడి ప్రజలతో ముచ్చటించి.. వారి సమస్యలను తెలుసుకొని.. వాటి పరిష్కారాలను అప్పటికప్పుడే సూచించి.. అభివృద్ధికి అక్కడే కార్యాచరణ రూపొందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని స్థానికులు కొనియాడుతున్నారు.
రూ.69 కోట్ల నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే.. రేవంత్ కండ్లుండీ కబోదిలా వ్యవహరిస్తూ దొంగ దీక్షలు చేస్తున్నాడని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తమ మీద ఎంతో ప్రేమ ఒలకబోస్తున్న రేవంత్.. ఎంపీగా ఆయనేం అభివృద్ధి చేశాడో చెప్పాలని నిలదీశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్, కేశవరం గ్రామాలను దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ తానే స్వయంగా అభివృద్ధిని పర్యవేక్షిస్తున్నారని, రేవంత్ మాత్రం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.