తీన్మార్ మల్లన్న డబ్బులకోసం మళ్లీ పాదయాత్ర మొదలు పెడుతున్నాడని క్యూన్యూస్ మాజీ బ్యూరో చీఫ్ చిలుక ప్రవీణ్ ఆరోపించారు. బుధవా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. పేదలు, బహుజన వర్గాలను వాడుకొని తాను లబ్ధి పొందడమే మల్లన్న ఉద్దేశమని చెప్పారు. మల్లన్నను చోటా నయీమ్‌గా అభివర్ణించారు. రోజూ అంగీలాగు సిద్ధాంతం గురించి మాట్లాడే మల్లన్నకు గత పాదయాత్ర నాటికి ఒక స్విఫ్ట్ కారు ఉండేదని.. ఇప్పుడు రెండు ఇన్నోవా లు, మూడు స్విఫ్ట్ కారులు, ఒక బొలేరో, చేతికి 45 వేల రూపాయల వాచీ, భువనగిరి దగ్గర ఐదెకరాల భూమి.. బినామీల పేరిట విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రవీణ్ వెల్లడించారు.
క్యూన్యూస్ కూడా నాగరాజుగౌ డ్, పరమేశ్, గడ్డి శ్రవణ్‌కుమార్‌కు చెందిన గోవింద్ క్రియేషన్స్ పేరిట ఉన్నదని తెలిపా రు. విద్య, వైద్యం ఫ్రీగా ఇవ్వాలని బాకా ఊదే మల్లన్న.. క్యాలిబర్ ఎడ్యుకేషన్ ఆఫ్ నెక్ట్స్ జనరేషన్ పేరుతో కన్సల్టెన్సీ పెట్టుకొన్నాడని ఆరోపించారు. చట్టానికి దొరకకుండా చాలా ఆర్గనైజింగ్‌గా క్రైమ్ చేస్తున్నాడని చెప్పారు. మల్లన్నకు నిజాయితీ ఉంటే తనపై తాను సీఐడీ విచారణ జరిపించుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యం టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, మంత్రులను తిట్టే తీన్మార్ మల్లన్న బీజేపీ శ్రేణులను ఒక్క మాట కూడా అనడని ప్రవీణ్ తెలిపారు.
దేశాన్ని తాకట్టు పెట్టిన బీజేపీని ఎందుకు విమర్శిస్తలేడో చెప్పాలని, ఇక్కడే లోపాయికార ఒప్పందమనేది స్పష్టమవుతుందని తెలిపారు. మల్లన్న అవినీతి అక్రమాలను త్వరలోనే సాక్ష్యాధారాలతో వెలుగులోకి తీసుకువస్తామన్నారు. పాదయాత్ర పేరుతో వెంట తిప్పుకొని తన స్వలాభం చూసుకున్న తర్వాత మల్లన్న నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతాడని ఖమ్మం జిల్లా తీన్మార్ మల్లన్న టీం మాజీ సభ్యుడు సంజీవరావు అన్నారు. మల్లన్న టీమ్‌ను అతని కుటుంబానికి సంబంధించిన నలుగురు లీడ్ చేస్తున్నారని, దళిత, గిరిజనులను దూరంగా ఉంచుతాడని ఆరోపించారు. ఈ సమావేశంలో న్యాత అశోక్, మహేశ్, మందకిషన్ తదితరులు పాల్గొన్నారు.