తెలంగాణ ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్‌గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి నియమితులయ్యారు. మండలి వైస్ చైర్మన్-1గా ఉన్న ఆయనను కౌన్సిల్ నూతన అఫిషియేటివ్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో లింబాద్రిని నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. ప్రొ ఫెసర్ పాపిరెడ్డి చైర్మన్ పదవీ బాధ్యతలను మంగళవారమే లింబాద్రికి అప్పగించారు.
2014 ఆగస్టులో ఉన్నత విద్యామండలిని ఏర్పాటుచేసిన ప్రభుత్వం, చైర్మన్‌గా ప్రొఫెసర్ పాపిరెడ్డిని నియమించింది. ఏడేండ్లకు పైగా ఆయన చైర్మన్‌గా వ్యవహరించారు. నియామక ఉత్తర్వులు అందుకున్న లింబాద్రి ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తొలి దళిత చైర్మన్
రాష్ట్రంలో దళితులను పేదరికంనుంచి బయటపడేసేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకొంటున్న ప్రభుత్వం, ఉన్నత పదవుల్లో కూడా వారికి సమున్నత స్థానం కల్పిస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో ఉన్నత విద్యామండలి చరిత్రలో చైర్మన్‌గా నియమితులైన తొలి దళిత వ్యక్తి లింబాద్రి కావడం గమనార్హం.
1988లో ఉమ్మడి ఏపీ ఉన్నత విద్యామండలి ఏర్పాటుకాగా, అప్పటి నుంచి 11 మంది చైర్మన్లుగా పనిచేశారు. అందులో ఒక్కరు కూడా ఎస్సీ సామాజికవర్గంవారు లేరు. రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ప్రస్తుతం కొత్త చైర్మన్‌ను మాత్రమే నియమించగా, త్వరలోనే పాలకవర్గాన్ని ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి.
వైస్ చైర్మన్-2గా పనిచేస్తున్న ప్రొఫెసర్ వెంకటరమణ అలాగే కొనసాగుతారని సమాచారం. కాగా, ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా గత ఏడేండ్లు సంతోషంతో సంతృప్తికరంగా సేవలందించానని ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. సుధీర్ఘకాలంపాటు ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.