ప్రపంచవ్యాప్తంగా ఏటా 130 కోట్ల మంది అధిక రక్తపోటు బారినపడుతున్నారని వీరు సకాలంలో వ్యాధిని గుర్తించలేకపోవడంతో గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. జీవన శైలి వ్యాధి అయిన బీపీని సులభంగా గుర్తించే వెసులుబాటుతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన మందులతో అదుపులో ఉంచుకునే వీలున్నా రోగుల్లో సగం మంది తమకు బీపీ ఉందనే విషయం తెలియడం లేదని దీంతో తీవ్ర అనారోగ్యాలు తలెత్తుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
సంపన్న దేశాలు బీపీని చాలా వరకూ అదుపులోకి తీసుకురాగా అల్పాదాయ దేశాల్లో హైపర్‌టెన్షన్ వ్యాప్తి చెందడం టెన్షన్‌కు గురిచేస్తోందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఊబకాయం, పేదరికం అధిక రక్తపోటుకు దారితీస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ, ఇంపీరియల్ కాలేజ్ లండన్ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం తెలిపింది. సబ్ సహరన్ ఆఫ్రికా, దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాలతో పాటు, కొన్ని ఫసిఫిక్ ఐలాండ్ దేశాల్లో హైపర్ టెన్షన్‌కు అవసరమైన చికిత్సను రోగులు పొందడం లేదని అధ్యయనం పేర్కొంది.
ఇక 2019లో గుండె జబ్బులతో 1.8 కోట్ల మంది మరణించగా వీరిలో అత్యధిక మరణాలకు అధిక రక్తపోటు ప్రధాన కారణమని అధ్యయనం తెలిపింది. జన్యుపరమైన రిస్క్ ఫ్యాక్టర్స్‌తో పాటు జీవనశైలి, అనారోగ్యకర ఆహారం, శారీరక వ్యాయామం కొరవడటం, ధూమపానం, మద్యపానం, ఊబకాయం వంటి కారణాలూ అధిక రక్తపోటుకు దారితీస్తున్నాయని పేర్కొంది. జీవనశైలి మార్పులతో ఈ పరిస్ధితిని నివారించవచ్చని అధ్యయనం స్పష్టం చేసింది.