కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను టోకుగా అమ్మకానికి పెట్టింది. ఆర్థికలోటు తీవ్రంగా ఉన్నందున ప్రజల ఆస్తులను ఆమ్మాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ అమ్మకం దశలవారీగా కొనసాగుతుందని చెప్పారు. దేశంలోని ప్రతి రంగంలో ప్రైవేటీకరణకు అనుమతిస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదం.సహజ వనరులైన గనులు మొదలుకొని రోడ్లు, ప్రాజెక్టులు, కంపెనీలను అమ్మబోతున్నట్లు కేంద్రం ప్రకటించటం గర్హనీయం. ఈ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వమూ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించలేదు, అమ్మకానికి పెట్టలేదు. ప్రస్తుతం అమ్మకానికి పెట్టిన వాటిలో రోడ్లు, రైలు మార్గాలు, రైళ్లు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ఇంధన పైప్ లైన్లు, రేవులు, రేవుల్లోని ప్రాజెక్టులు, గోదాములు, విమానాశ్రాయాలు, స్టేడియంలు, జాతీయ క్రీడా ప్రాంగణాలున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ, ఆస్తి అంటూ ఏదీ మిగలకుండా స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు తెగనమ్మటానికి బీజేపీ కంకణం కట్టుకొని పనిచేస్తున్నది. నిధుల సేకరణే లక్ష్యంగా దేశ సంపదను, వనరులను తెగనమ్మటం ఏవిధమైన జాతీయవాదమో, దేశభక్తో వారే చెప్పాలి.
తెలంగాణ అభివృద్ధి కోసం మిగులు భూముల్లో కొంత భాగాన్ని అమ్మితే ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు నానా హంగామా చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఏమంటారో చూడాలి. ప్రజా ఆస్తులను, సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెడుతున్న తీరు నిస్సందేహంగా ప్రజా వ్యతిరేకమైనదే. దేశభక్తి, జాతీయత అంటే దేశ సంపదను అంగట్లో అమ్మకానికి పెట్టటం కాదు.
దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయం దారుణంగా పడిపోయింది. నిధుల సమీకరణ కోసం కేంద్రం ప్రైవేటీకరణకు తెరలేపింది. ఇప్పటికే కీలక రంగాల్లో వ్యూహత్మక పెట్టుబడుల ఉపసంహరణకు తెరతీసిన కేంద్రం స్టీల్ ప్లాంట్లు, రోడ్లు, రవాణా పాటు పలు ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నది. ఆయా ఆస్తులను అమ్మేయనున్నది. రానున్న నాలుగేండ్లలో దేశవ్యాప్తంగా పలు కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఆరు లక్షల కోట్లు ఆర్జించాలని కేంద్రం భావిస్తున్నది.
కొన్ని వ్యూహాత్మక రంగాల్ని వదిలిపెట్టి మిగతా రంగాలన్నింటిలోనూ పెట్టుబడుల్ని ఉపసంహరించాలని కేంద్రం భావిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇలా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 1.75 లక్షల కోట్లు ఆర్జించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. తదుపరి సంవత్సరాల్లో రోడ్ల నుంచి 1.6 లక్షల కోట్లు, రైల్వేల నుంచి 1.5 లక్షల కోట్లు, విద్యుత్ రంగ ఆస్తులు లక్ష కోట్లు, గ్యాస్ పైప్‌లైన్లు 59 వేల కోట్లు, టెలికమ్యూనికేషన్ ఆస్తుల అమ్మకం ద్వారా 40 వేల కోట్లు సమకూర్చుకో వాలని కేంద్రం భావిస్తున్నది. పబ్లిక్ గిడ్డంగులు, పౌర విమానయానం, పోర్టుల్లోని మౌలిక సదుపాయాలు, క్రీడా స్టేడియంలు, మైనింగ్ ఆస్తుల అమ్మకం ద్వారా దాదాపు లక్షకోట్లు రావొచ్చని అంచనా. ఆస్తుల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం బడ్జెట్ లోటును తగ్గించడంలో కీలకమైనది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తిలో ఈ ఆదాయం 6.8 శాతంగా ఉంటుందని కేంద్రం అంచనా వేసింది.
రోడ్లు, రవాణా, హైవేలు, రైల్వేలు, విద్యుత్, సహజవాయువు, ఎయిర్ పోర్టులు, ఓడరేవులు, టెలికమ్యూనికేషన్స్, పౌర, ప్రజా సరఫరాలు, మైనింగ్, బొగ్గు, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి రంగాల్లో ప్రైవేటీకరణను ప్రోత్సహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించటం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం నిధుల కోసం నిరుపయోగ భూముల అమ్మకం చేపడితే గగ్గోలు పెట్టిన బీజేపీ నేతలు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలకు సమాధానం చెప్పాలి.
మతాన్ని, దేవున్ని కూడా రాజకీయాలకు వాడుకున్నది బీజేపీ. అయోధ్య వివాదం, మెజారిటీ హిందుత్వ వాదం ఈ పునాదుల్లోంచి వచ్చినవే. దేశం, ప్రజల ప్రయోజనాలు ఏ మాత్రం పట్టకుండా వ్యవహరిస్తున్న బీజేపీ తెలంగాణలో మాత్రం రాష్ట్రప్రభుత్వంపై విషప్రచారానికి దిగుతున్నది. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా ప్రభుత్వాన్ని ప్రజలకు తప్పుగా చూపించాలనే కుట్రపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించేముందు.. కేంద్రంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ముందుగా గళం విప్పాలి. దేశాభివృద్ధి, రాష్ర్టాల ప్రగతిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే దేశ వనరులను, ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టిన కేంద్రాన్ని ప్రశ్నించాలి. రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు జీవంలేని విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూ, మోసపూరిత మాటలు చెప్పే పార్టీలకు బుద్ధి చెప్పిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉన్నదని మరువొద్దు!