వికారాబాద్ జిల్లా దరూర్ మండలం గడ్డమీది గంగారాం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారిణి, రాష్ట్ర సాధనలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కాళ్లకు గజ్జె కట్టి, తన గొంతు ద్వారా అనేక పాటలు పాడి ప్రజలను ఉద్యమ ఉద్యుక్తులను చేసి గాయకురాలు భాగ్య కు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి అండగా నిలిచారు. ఆమెకు కంటి శస్త్ర చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా పర్యటన లో ఉన్న ఎంపీ రంజిత్ రెడ్డి ని సోమవారం వికారాబాద్ జిల్లా యువ నాయకులు వడ్ల నందు ఆధ్వర్యంలో భాగ్య కలిశారు.తనకు కంటి శస్త్ర చికిత్సతో పాటు సాంస్కృతిక సారథి లో ఉద్యోగం ఇప్పించాలంటూ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి స్పందిస్తూ, బాగ్యకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్స చేయిస్తాను అని..అక్కడి నుండే వెంటనే హాస్పిటల్ సిబ్బంది తో ఫోన్ లో మాట్లాడారు. “ఆరోగ్యం మెరుగైన తర్వాత ఉద్యోగ విషయమై సాంస్కృతిక శాఖ విభాగం తో మాట్లాడి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తాన”ని చెప్పారు. దీంతో భాగ్య కన్నీటి పర్యంతం అయింది. తన పట్ల ఎంపీ రంజిత్ రెడ్డి చూపిన ఔదార్యానికి కృతజ్ఞతలు తెలిపింది.
“సార్..మీరు నా లాంటి వారి పట్ల ఇంతిటి సహాయం చేయడానికి ముందుకు రావడం పట్ల ధన్యవాదాలు” తెలిపింది. “అలా అనొద్దు తల్లి…!మీలాంటి కళాకారుల కష్టం, సేవ తెలంగాణ ఉద్యమ సమయంలో మరువలేనివి… మీలాంటి వారికి నా వంతు సహాయం చేయడం బాధ్యత గా భావిస్తాను.” అని చెప్పడంతో అక్కడి వచ్చిన స్థానిక యువకులు.. జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై రంజిత్ అన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఎంపీ రంజిత్ రెడ్డి సేవా తత్పరతను అందరూ మెచ్చుకున్నారు.