రానున్న 20 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుందని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం నగరంలోని తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ముగిసింది.
ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి శాఖల పునర్నిర్మాణం వరకు సమావేశంలో చర్చించారు. అదేవిధంగా దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ చేయాల్సిన కృషిపై సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నవంబర్ మొదటివారంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. దళిత బంధుపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ప్రతిపక్షాల తప్పుడు విమర్శల్ని తిప్పికొట్టాల్సిందిగా పిలుపునిచ్చారు.
దళితబంధును ఉద్యమంలా చేయాలన్నారు. వచ్చే నెల 2వ తేదీన ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు శంకుస్థాపన చేసుకోబోతున్నట్లు తెలిపారు. దశలవారీగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. త్వరలోనే కొత్త జిల్లా అధ్యక్షులను నియమిస్తామని సీఎం పేర్కొన్నారు.