తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్‌కు అవకాశం లేదని.. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం 27 వేల పడకలు ఉన్నాయని, మరో ఏడు వేల పడకలు నెలాఖరుకు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరంలో చేపట్టిన 100 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇందులో భాగమేనని పేర్కొన్నారు.
ఖైరతాబాద్ సర్కిల్‌లోని ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్‌లో సోమవారం టీకా పంపిణీ కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, కమిషనర్ లోకేశ్‌కుమార్, సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్‌లతో కలిసి సోమేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
హైదరాబాద్‌లో తప్ప దేశంలోని ఏ మెట్రో నగరంలోనూ 100 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టలేదని వివరించారు. 15 రోజుల్లో 100 శాతం మందికి కనీసం తొలి డోసు వేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. కాగా, మొదటి డోసుకు వచ్చిన వారితో సీఎస్ మాట్లాడారు. ఎందుకింత ఆలస్యం చేశారని ప్రశ్నించారు.