కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ( Delta Variant ) వ్యాప్తిని చైనా సమర్థవంతంగా అడ్డుకుంటోంది. సోమవారం రోజున ఆ దేశంలో స్థానికంగా ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు. జూలై తర్వాత జీరో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. నేషనల్ హెల్త్ కమిషన్ ఈ విషయాన్ని చెప్పింది. జూలై 20వ తేదీ నుంచి చైనాలో డెల్టా వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తోంది. నాన్‌జింగ్ నగరంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ సిబ్బందిలో తొలిసారి డెల్టా కేసులు బయటపడ్డాయి. కొన్ని రోజుల్లోనే 31 ప్రావిన్సుల్లో 1200 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఆ తర్వాత చైనా చాలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. డెల్టా దూసుకువెళ్తున్న తీరును చాలెంజ్‌గా తీసుకున్న చైనా ఆ వైరస్ వేరియంట్‌ను సమర్థవంతంగా నిలువరిస్తోంది.
ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే.. ప్రపంచంలో డెల్టా వేరియంట్ దూకుడును అడ్డుకున్న తొలి దేశంగా చైనా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. డెల్లా వేరియంట్ వల్ల చాలా దేశాలు తమ సరిహద్దుల్ని మూసివేశాయి. ఆస్ట్రేలియాలో పలు నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.