హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకానికి ప్రభుత్వం సోమవారం మరో రూ.500 కోట్లను విడుదలచేసింది. ఈ పథకం అమలుకు ఇప్పటికే రూ.500 కోట్లు విడుదలచేసిన సంగతి తెలిసిందే. తాజా నిధుల విడుదలతో కరీంనగర్‌లో దళితబంధు ప్రత్యేక ఖాతాకు మొత్తం రూ.వెయ్యి కోట్లు జమయ్యాయి.
ఈనెల 16న హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల మంజూరు పత్రాలను అందజేసి పథకానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 20,929 దళిత కుటుంబాలున్నాయి. అన్ని కుటుంబాలకు వర్తించే విధంగా (సాచురేషన్ మోడ్) ఈ నిధులను వినియోగిస్తారు. ఇందుకోసం త్వరలోనే మరో రూ.వెయ్యి కోట్లు విడుదలచేయనున్నారు.
సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రి (యాదాద్రి-భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం)లోని 76 దళిత కుటుంబాలు, పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని కుటుంబాల స్థితిగతులపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఆయా కుటుంబాల్లో ఎవరైనా ఇప్పటికే ఏదైనా వ్యాపార రంగంలో ఉన్నారా? వారి విద్యార్హతలు ఏమిటి? అభిరుచి ఏమిటన్న అంశాలపై ఉన్నతాధికారుల బృం దాలు ఇంటింటికి వెళ్లి తెలుసుకొని వారికి కూడా అవగాహన కల్పిస్తున్నారు. దాదాపు 47 వివిధ వ్యాపార యూనిట్ల గురించి లబ్ధిదారులకు వివరించే పనిలో అధికారులు నిమగ్న మయ్యారు.