హైదరాబాద్ శివారు బుద్వెల్ లో నిర్మిస్తున్న రెడ్డి హాస్టల్ భవనానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ది నిధి నుంచి ఈ నిధులను విడుదల చేస్తూ ఆర్ధిక, ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.
రాజాబహాదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా బుద్వెల్ లో 15 ఎకరాలు కేటాయించింది. రెడ్డి హాస్టల్ భవనం నిర్మాణానికి ఈ భూమిని కేటాయించింది. ఇందులో విద్యార్థినీ, విద్యార్థులకు కోసం ప్రత్యేక భవనాలు, కిచెన్ కమ్ డ్రాయింగ్ బ్లాక్ నిర్మాణం కోసం రూ. 13.64 కోట్లతో అంచనాలు తయారు చేసి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రభుత్వానికి పంపించింది.
ఇందులో రూ. 3.64 కోట్లు తన షేర్ గా ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం రూ. 10 కోట్లను విడుదల చేసింది. నిధుల విడుదలపై రెడ్డి జనసంఘం సలహాదారు, ఎడ్యుకేషనల్ సొసైటీ లైఫ్ మెంబర్ శ్రీ దశరథరెడ్డి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చే పేద రెడ్డి యువతకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.