తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ సంస్థలకు రూ.432కోట్ల నిధులను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ నిధులు కేటాయించింది. గ్రామ పంచాయతీలకు రూ.182.49 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.124.11 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.125.95కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా సమయంలోనూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు.తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే సదుద్దేశంతో ప్రణాళికాబద్దంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందన్నారు. మౌలిక సదుపాయల కల్పన, పచ్చదనం, పరిశుభ్రతకు కార్యక్రమంలో ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమం అమలుతో రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు సమకూర్చామన్నారు. అలాగే అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులతో పల్లెల సమగ్ర స్వరూపం మారుతోందన్నారు.