అనాథలకు బంగారు భవితను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని, వారికి కేజీ టు పీజీ విద్యనందించడంతోపాటు అదనంగా పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తామని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అనాథల సంక్షేమం కోసం ఏర్పాటైన సబ్‌కమిటీ సభ్యులు బుధవారం సరూర్‌నగర్‌లోని వీఎం హోమ్‌ను సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారుల సమస్యలను, భవిష్యత్తులో వారికి కావాల్సిన వసతులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఎక్కడికెళ్లాలో తెలియక భవిష్యత్తు అంధకారమవుతున్నదని, వివాహమయ్యే వరకు ప్రభుత్వం అండగా ఉండాలని చిన్నారులు కోరారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. అమ్మానాన్నలు లేరని చింతించాల్సిన పనిలేదని, రాష్ట్ర ప్రభుత్వమే అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన వీఎం హోమ్ వేలమంది అనాథలకు ఆశ్రయం కల్పించిందని ప్రశంసించారు. రాష్ట్రంలో 15 వేల మంది అనాథలున్నట్టు గుర్తించామని, వారి సంక్షేమానికి రూపొందించే ప్రత్యేక పాలసీకి సలహాలు, సూచనలు తీసుకొంటున్నామని తెలిపారు.
కొవిడ్ వల్ల చాలా మంది చిన్నారులు అనాథలుగా మిగిలారని, వారిని అక్కున చేర్చుకొని ఆదరిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ పద్మజ రమణ, ప్రిన్సిపల్ సెక్రటరీ దివ్యదేవరాజ్, సరూర్‌నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరికృష్ణయ్య, వీఎం హోమ్ ప్రిన్సిపాల్ సుహాసిని, సూపరింటెండెంట్ లక్ష్మీపార్వతి, మాజీ కార్పొరేటర్ అనితాదయాకర్‌రెడ్డి, నియోజకవర్గ టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, డివిజన్ అధ్యక్షుడు ఆకుల అరవింద్‌కుమార్, యూత్‌వింగ్ అధ్యక్షుడు లోకసాని కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.