ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఇక అక్కడి మహిళలు ఇండ్లలో సెక్స్ బానిసలుగా మగ్గాల్సిందేనని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాబూల్‌లోని గోడపై మహిళ చిత్రాన్ని ఓ వ్యక్తి చెరిపేస్తున్న ట్విటర్ ఫోటోపై కామెంట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు మహిళలను ఎక్కడా కనిపించకుండా చేస్తారని..మహిళలు ఇండ్లలోనే సెక్స్ బానిసలుగా మగ్గిపోతూ పిల్లల్ని కనే యంత్రాలుగా ఉండాలని వారు భావిస్తారని అన్నారు.
ఇస్లాం స్త్రీ వ్యతిరేకతతో కూడినదని తస్లీమా నస్రీన్ వరుస ట్వీట్లలో వ్యాఖ్యానించారు. 1996 నుంచి 2001 వరకూ సాగిన తాలిబన్ల అరాచక పాలనలో మహిళలు పనిచేయడంతో పాటు టీవీ, మ్యూజిక్‌ను నిషేధించారని..వారు తిరిగి ఇవే నిబంధనలను తిరిగి విధిస్తారా అని ఆమె ప్రశ్నించారు. ఏ ఒక్క ముస్లిం దేశం కూడా మహిళలను సాటి మనుషులుగా వ్యవహరించదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.