తెలంగాణలో ఏడేండ్ల కిందట రైతుల ఆత్మహత్యలు.. ఆగమైపోయిన బతుకులు.. కరంటు రాదు.. మంచినీళ్లు రావు. ఇట్లా అనేకమైన ఇబ్బందులు. ఇయ్యాల అవన్నీ ఉన్నయా? ఈ రోజు నా తెలంగాణ రైతులు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారు.
పండిన పంటను గుంజలేక లారీలకు, మోయలేక హమాలీలకు దమ్మొస్తున్నది. రాష్ట్రం ఇంకా ప్రగతి సాధించాలె. కరువు కాటకాల్లేని, సస్యశ్యామల తెలంగాణ కావాలె.
అదే పద్ధతిలో గతంలో అణిచివేతకు గురైన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 75 లక్షల మంది దళిత ప్రజానీకం కూడా ధనిక ప్రజానీకమై కాలర్ ఎగరేసి, ‘ఎస్.. మాది తెలంగాణ. మేము దళిత సోదరులం. మేము పైకొచ్చినం’ అని చెప్పే రోజు రావాలె అని దళితబంధు పథకాన్ని సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం వేదికగా ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు.