‘ప్రజాస్వామ్యమంటే సమానత్వమే. వీలైనంత తొందరగా దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపాలి. దళితుల అభివృద్ధి అందుకు సోపానం కావాలి’ అన్న అంబేద్కర్ ఆశయాన్ని తెలంగాణ ప్రభుత్వం అక్షరాలా నెరవేరుస్తున్నది. స్వరాష్ట్రంలో దళిత జనోద్ధరణే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు, ప్రత్యేక కార్యక్రమాలను అమలుచేస్తున్నది. తూతూ మంత్రంగా సాయంచేసి.. ఆర్భాటపు ప్రచారాలు చేసుకొని.. చేతులు దులుపుకోకుండా దళితుల సమస్యను మూలాల నుంచి పెకలించి వేసేందుకు కృషిచేస్తున్నది. ఎస్సీల్లో అన్ని వయసులు, అన్ని వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నది. తాజాగా దళితులు ఆర్థికంగా ఉన్నతస్థాయికి ఎదిగే మార్గాలపై దృష్టి పెట్టింది. వైన్స్‌లు, ఎరువుల దుకాణాలు, మెడికల్ షాప్‌లు వంటివాటిల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో దళిత జనోద్ధరణలో నవశకం ప్రారంభం కానున్నది. దళితబంధు పథకం కింద ప్రభుత్వం రూ.10 లక్షలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కరు సొంతగా లేదా ఇద్దరుముగ్గురు కలిసి ఒక బృందంగా ఏర్పడి వీటిని ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తే వారి జీవితాలు బాగుపడుతాయనే యోచనలో సీఎం కేసీఆర్ దీనికి నాంది పలికారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మద్యం దుకాణాలు, ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు, రేషన్ షాపులు, వివిధ శాఖల్లోని కాంట్రాక్ట్ పనులు, విద్యాసంస్థలు, రిటైల్ వ్యాపారాలు వంటివాటిలో రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నది.
భావి మేధోవర్గానికి బాటలు
‘చదువుతోనే జాతి బాగుపడుతుంది’ అన్న ఫూలే నినాదం స్ఫూర్తిగా దళితుల్లో విద్యావ్యాప్తిపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా 268 ఎస్సీ గురుకులాలను ఏర్పాటుచేసింది. డిగ్రీ వరకు ఉచిత విద్యనందిస్తున్నది. సకల సౌకర్యాలు కల్పించి, దళిత బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నది. భావి మేధోవర్గాన్ని తయారు చేస్తున్నది. ఈ గురుకులాల్లో సుమారు 1.35 లక్షల మంది చదువుతున్నారు. మొత్తంగా ఇప్పటివరకు గురుకులాల కోసం రూ.4,500 కోట్ల వరకు ఖర్చు చేసింది. విదేశాలకెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ పథకం కింద రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నది. గత ఏడేండ్లలో మొత్తం 620 మంది విద్యార్థులకు రూ.107.54 కోట్లు సహాయం అందజేసింది.
ఎస్సీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ‘టీ-ప్రైడ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఔత్సాహిక ఎస్సీ పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల శాఖ నుంచి పలు రాయితీలు ప్రకటించింది. స్టాంప్‌డ్యూటీని 100% మినహాయించడం, భూమి కొనుగోలు వ్యయంలో సాయం, కరెంటు చార్జీల్లో సబ్సిడీ, పెట్టుబడిలో 35% రాయితీ.. ఇలా అనేకం ప్రకటించింది. ఆరేండ్లలో ఎస్సీలకు పరిశ్రమల శాఖ తరఫున వివిధ స్కీంల కింద రూ.482 కోట్లు సబ్సిడీ ఇచ్చింది. పావలా వడ్డీకింద రూ.10.03 కోట్లు కేటాయించింది.
దళిత మహిళా సాధికారత కోసం
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా నిరుపేద దళిత మహిళలకు మూడెకరాల భూమిని ఇచ్చే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నది. దళిత మహిళా సాధికారతను సాధించడంలో భాగంగా ప్రభుత్వం ప్రైవేట్ భూములను కొనుగోలు చేసి వందశాతం సబ్సిడీతో వారికి కేటాయిస్తున్నది. ఇప్పటివరకు 6,874 మంది లబ్ధిదారులకు 16,906 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చింది. ఇందుకోసం రూ.756 కోట్లు ఖర్చు చేసింది.