స్వాతంత్య్ర దినోత్సవం మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో రైతన్న రుణ విముక్తుడవనున్నాడు. రెండో విడుత పంటరుణాల మాఫీ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ దఫాలో బ్యాంకుల్లో రూ.50 వేలలోపు ఉన్న పంట రుణాలన్నింటినీ ప్రభుత్వం మాఫీ చేస్తున్నది. మొత్తం 6,06,811 మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది.
ఇందుకోసం ప్రభుత్వం రూ.2,006 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే వేయనున్నారు. ఈ నెలాఖరులోపు ప్రక్రియ మొత్తం పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడుత రుణమాఫీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో లాంఛనంగా ప్రకటించారు. ‘ఆగస్టు 16వ తేదీ నుంచి రాష్ట్రంలోని 6 లక్షల మంది అన్నదాతలకు రూ.50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నాం. దీంతో మొత్తం 9 లక్షల మంది రైతన్నలు రుణవిముక్తులు అవుతారు’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
రైతుబంధు మాదిరిగానే రుణమాఫీ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి. రైతుబంధు నిధులు ముందుగా ఒక గుంట నుంచి ఎకరా వరకు విడుదల చేసి, ఆ తర్వాత ఒక్కో ఎకరం పెంచుకుంటూ నిధులు మంజూరు చేశారు. రుణమాఫీలోనూ ముందుగా రూ.25 వేలు-26 వేల వారికి ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఒక్కో వెయ్యి పెంచుకుంటూ రైతుల ఖాతాల్లో డబ్బు జమచేస్తారు. రూ.50వేల లోపు రుణాలున్నవారికి మాఫీ ప్రక్రియతో రెండో విడుత ముగుస్తుంది.