తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూవర్స్(టీ-ప్రైడ్) పథకం కింద ఎస్సీ, ఎస్టీ యువతకు సబ్సిడీపై ఎలక్ట్రిక్ కార్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి కార్లను పంపిణీ చేయనున్నారు. ఇంతకుముందు జీహెచ్‌ఎంసీ, మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘డ్రైవర్ కమ్ ఓనర్’ పేరిట నిరుద్యోగ యువతకు సబ్సిడీపై కార్లను అందించారు.
ఎస్సీ, ఎస్టీ యువతకు కూడా టీ-ప్రైడ్ పథకం కింద కార్లను అందించాలని నిర్ణయించారు. దీనికి ఏర్పాట్లుచేయాలని ఇటీవల ప్రభుత్వం తెలంగాణ స్టేట్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్‌రెడ్కో)కు లేఖ రాసింది. టీ-ప్రైడ్ పథకంలో భాగంగా కొత్తగా వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించే ఎస్సీ, ఎస్టీ యువతకు 35 శాతం వరకూ సబ్సిడీ ఇస్తున్నారు.
ఇటీవల మైనారిటీ సంక్షేమశాఖ అందించిన కార్లపై 60శాతం రాయితీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతరత్రా పన్నుల్లో భారీగా రాయితీలు కల్పిస్తున్నది. ఈ క్రమంలో టీఎస్ రెడ్కో అధికారులు టీ-ప్రైడ్‌కు సంబంధించిన వివరాలపై పరిశ్రమల శాఖతో, అలాగే రుణ సహాయంపై బ్యాంకు అధికారులతో చర్చిస్తున్నారు. కొత్తగా ఇచ్చే కార్లకు కనీసం 35 శాతానికి తగ్గకుండా సబ్సిడీ ఇవ్వాలని, మిగిలిన మొత్తంలో కొంత బ్యాంకు ద్వారా రుణ సహాయం కల్పించి కొంత లబ్ధిదారు భరించే విధంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.