కరోనా కట్టడిలో తెలంగాణ ముందున్నదని కేంద్ర గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 5 శాతానికి మించలేదని కేంద్రం వెల్లడించింది.
దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 5 నుంచి 15 శాతం ఉన్న జిల్లాలు, కరోనా మరణాల సంఖ్యపై రాజ్యసభ సభ్యుడు వివేక్ కే టంఖా అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. తెలంగాణలో 2019, 2020 సంవత్సరాల్లో 1,541 కరోనా మరణాలు నమోదుకాగా, ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 5 వరకు 2,273 మంది కొవిడ్‌తో మృతిచెందారని పేర్కొంది. జాతీయ స్థాయిలో మరణాల రేటు 1.3 శాతం ఉండగా రాష్ట్రంలో 0.58 శాతానికే పరిమితమైంది.
రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.54 శాతం
రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల కరోనా అదుపులో ఉన్నది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సగటు పాజిటివిటీ రేటు 0.54 శాతంగా నమోదైంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 88 వేల పరీక్షలు నిర్వహించగా, 482 కేసులు నమోదయ్యాయి.
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్‌తోపాటు మూడు దఫాలుగా జ్వరసర్వే నిర్వహించడంతో వైరస్‌పై నియంత్రణ సాధ్యమైందని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు, సెరో సర్వే ప్రకారం రాష్ట్రంలో 63.1 శాతం మందిలో యాంటీబాడీలున్నాయి. రాష్ట్రంలో ప్రతి 10 మందిలో ఆరుగురికి వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నదని అంచనా.