దళిత బంధు పేరుతో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఒక చారిత్రక నిర్ణయాన్ని ప్రకటించి కొత్త చర్చకు తెరలేపారు. కొందరు విమర్శిస్తున్నట్టు అది హడావుడిగా తెచ్చిన పథకం కాదు. ఈ పథకంపై ఏడాది కాలంగా ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఇటువంటి పథకం రాబోతుందన్న సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. గడిచిన ఆరు నెలల్లో అనేక చర్చలు, సంప్రదింపులూ జరిపారు. దళిత శాసన సభ్యులు ఇప్పటికే ఒకసారి కడియం శ్రీ హరి నాయకత్వంలో, మరోసారి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో సమావేశమై దళిత సాధికారతకు తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యంగా సామాజిక, ఆర్థిక పరిపుష్టికి చేపట్టవలసిన ప్రణాళికలు, పథకాలపై చర్చించారు. అంతే కాకుండా గత బడ్జెట్‌లోనే దీనికోసం ప్రత్యేక నిధులూ కేటాయించారు. నిజానికి గత మార్చి నెలలోనే మొదలు కావాల్సి ఉన్న ఈ పథకం ఇప్పటికే ఆలస్యమయింది. ఇప్పటికైనా దానికి కార్యరూపం తెచ్చినందుకు కేసీఆర్‌ను అభినందించాల్సింది పోయి కేసీఆర్ ఓట్ల కోసం వేల కోట్లు వెదజల్లి ప్రజాధనం వృథా చేస్తున్నట్లు ప్రచారం చేయడం కేవలం దళిత వ్యతిరేకత తప్ప మరొకటి కాదు.
దళితబంధు విధివిధానాలు ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కానప్పటికీ ఇది దాదాపు రెండు దశాబ్దాల నాటి ‘భోపాల్ డిక్లరేషన్’ను తలపిస్తోంది. 2002 జనవరిలో భోపాల్ కాన్ఫరెన్స్ పేరుతో అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఆ రాష్ట్ర రాజధానిలో ఒక మహా సమ్మేళనం నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి దళిత బహుజన మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాత్రికేయులు అనేకమంది ఆ సదస్సుకు తరలి వెళ్లారు. జేఎన్‌యూలో చదివిన నవతరం దళిత బుద్ధిజీవుల నేతృత్వంలో ఒక శాస్త్రీయ డాక్యుమెంట్ మీద సమగ్ర చర్చ జరిగింది. అనంతరం ‘భోపాల్ డిక్లరేషన్’ పేరిట ఒక చారిత్రక పత్రాన్ని ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర విధాన సభ ఆవరణలో జరిగిన ఆ సదస్సు దేశం దృష్టిని ఆకర్షించింది. భోపాల్ డిక్లరేషన్ సామాజిక విప్లవానికి ఒక ‘మాగ్నాకార్టా’ కాబోతుందని మీడియా అభివర్ణించింది.
భోపాల్ డిక్లరేషన్‌లో ‘21వ శతాబ్దానికి 21 అంశాల కార్యాచరణ ప్రణాళిక’ పేరుతో పలు కీలకమైన అంశాలను చేర్చారు. ఇవి పూర్తిగా ఒక నవసమాజ నిర్మాణానికి కావాల్సిన సామాజిక ఆర్థిక పునాదులను వేసే ప్రతిపాదనలు. అదేవిధంగా వైరుధ్యాలు తొలగించే సాంస్కృతిక అంశాలను కూడా అందులో పొందుపరిచారు. భారత దేశంలోని ప్రజల సామాజిక వైవిధ్యతను కాపాడాలని, సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో సమతుల్యత పాటిస్తూ దళితులకు సమాన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని, అభివృద్ధిలో భాగస్వామ్యంతో పాటు, సంపదను సమానంగా పంచేలా ప్రణాళికలు రూపొందించాలని, ప్రభుత్వ వనరులు, అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులలో దళితులకు వాటా ఇచ్చి ‘దళిత పెట్టుబడి’ని సృష్టించాలని, పారిశ్రామిక రంగంలో దళితులను ప్రోత్సహించే విధంగా పథకాలు రూపొందించాలని, నిరుపేద దళిత కుటుంబాలకు వ్యవసాయ భూములు పంచి, వ్యవసాయ కూలీలకు భద్రత కల్పించి, భరోసా ఇవ్వాలని నిర్దేశించింది. అలాగే అన్యాక్రాంతమైన దళితుల భూములు, అసైన్డ్ భూములను నిర్ణీత కాలవ్యవధిలో వెనక్కి తీసుకుని దళితులకు అందించాలని,దానికోసం చట్టబద్ధమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. వేధింపులు, వివక్షలేని సమసమాజమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలని, అందుకు కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో వ్యవస్థలను పటిష్ఠం చేయాలని పేర్కొన్నారు. చదువు ఒక కీలక మానవవనరు కాబట్టి దళితులకు ఉచిత, నాణ్యమైన విద్య ఇంగ్లీష్ మీడియంలో అందించాలని, ఉన్నత విద్య, విదేశీ విద్యకు అవకాశాలు పెంచాలని, చదువులకు, పరిశోధనలకు స్కాలర్‌షిప్‌లు అందించాలని పేర్కొంది. ఇట్లా అభివృద్ధిలో దళితులను అంతర్భాగం చేసే అంశాలతోపాటు అప్పటికే పాతుకుపోయిన ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని, ఇప్పటికీ సాధ్యపడని న్యాయ వ్యవస్థలో, సైనిక, రక్షణ వ్యవస్థలో కూడా సమాన ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఈ పత్రంలో పేర్కొన్నారు. ఈ 21 సూత్రాలను యథాతథంగా ఆమోదిస్తున్నట్టు దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. ఆ అంశాలన్నీ మధ్యప్రదేశ్‌లో అమలు చేస్తామని, జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ మానిఫెస్టోలో వాటిని చేర్చి దేశవ్యాప్తంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ మరుసటి ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. భోపాల్ డిక్లరేషన్ ఒక నెరవేరని కలగా మిగిలిపోయింది.
ఇప్పుడు కేసీఆర్ అదే కలను ఆవిష్కరిస్తున్నట్టు కనిపిస్తోంది. గత జూన్ 27న అఖిలపక్షంలో చర్చకు వచ్చిన అంశాలు, ముసాయిదా పత్రాల్లో పొందుపరిచిన అంశాలు 21వ శతాబ్దపు దళిత ఎజెండాను ప్రతిఫలిస్తున్నాయి. ఇందులో దళిత వర్గాల సాధికారతకు తోడ్పడే అనేక అంశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకటించిన మూడెకరాల వ్యవసాయ భూమి విఫలమయిందన్న విమర్శ ఉంది. భూమి లభ్యత లేకపోవడమే దానికి ప్రధాన కారణంగా చెపుతున్నారు. భూమి లభ్యత లేని చోట దళిత వ్యవసాయ కూలీలు, రైతులకు బీమా సౌకర్యం కల్పించాలనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయ భూమి ఉన్న వారికి మాత్రమే రైతు బంధుతో పాటు రైతు బీమా వర్తిస్తుంది. పేద దళితులకు భూమి లేకపోవడం వల్ల వారు బీమా పథకానికి కూడా అర్హులు కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని గతంలో దళిత శాసన సభ్యులు కూడా కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పుడు అది కార్యరూపం దాల్చితే లక్షలాది పేదరైతులకు భరోసా దొరుకుతుంది. అలాగే భూమిలేని దళితులు వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి కూలీలుగా మిగిలి పోకుండా వారికి ఆర్థిక స్వావలంబన కలిగించే దిశగా డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో భాగస్వాములను చేయాలని కూడా భావిస్తున్నారు. దీనికి పూర్తి ఆర్థిక సహాయంతో పాటు అన్ని వసతులు సమకూర్చి, అనుమతులను ఇచ్చి ప్రోత్సహించేవిధంగా పథకాలను సిద్ధం చేస్తున్నారు. అదికూడా సాధ్యపడని సందర్భంలో వారి ఆర్థిక స్వావలంబన కోసం పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశం అఖిలపక్షంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నిబంధనలు, షరతులతో సంబంధం లేకుండా, నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి మనీ ట్రాన్స్‌ఫర్ అయ్యేవిధంగా పథకాన్ని రూపొందిస్తున్నట్టు సిఎం ప్రకటించారు. ఈ సొమ్ముతో ఏ వ్యాపారం చేయాలని నిర్ణయించుకునే అధికారం లబ్ధిదారుని ఆసక్తికి, ఇష్టానికే వదిలేస్తారు. కేసీఆర్ రూపొందించిన బ్లూ ప్రింట్‌లో ప్రభుత్వ టెండర్లలో, కొత్త వ్యాపారాల్లో వాటా కూడా ఉండడం ఒకరకంగా దళితులను స్వతంత్రులుగా నిలబెట్టి వారిని ఆర్థికంగా ఎదిగేలా చేసే చర్యగా పేర్కొనవచ్చు. దళిత సాధికార ప్రణాళికలో భాగంగా వైన్ షాప్‌లు, బార్ షాపులు మొదలు ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి ప్రజలకు సరుకులు, సేవలు అందించే అన్ని రంగాల్లో కూడా దళితులకు వాటా ఉండే విధంగా ముఖ్యమంత్రి పథక రచన చేసినట్లు చెబుతున్నారు. ఇది వైన్ షాప్ దగ్గర ఆగిపోకుండా దళిత పారిశ్రామిక వేత్తలను, వ్యాపారస్తులను రూపొందించే దశకు చేరాలి. దానికి పారిశ్రామిక విధానాన్ని సవరించి వెసులుబాటు కల్పించాలి.
దళిత బంధు సాధికారత ప్రణాళికలో మానవ వనరుల వికాసానికి పెద్దపీట వేస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ ఇప్పటికే దళితులకు విద్యావకాశాలు కల్పించడంలో దేశంలో అగ్రభాగాన ఉంది. ఇంగ్లీష్ మీడియంలో దళితులకు ఇప్పటికే కేజీ నుంచి యూజీ దాకా సకల సౌకర్యాలతో గురుకుల విద్య విద్య అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణా ప్రాంతంలో కేవలం 298గా ఉన్న విద్యాసంస్థల సంఖ్య ఇప్పుడు 1400 దాటింది. వీటిని మరింతగా ప్రోత్సహించడం ద్వారా రానున్న రోజుల్లో దళితుల్లో ఉన్నత విద్యావంతులను పెంచే చర్యలు చేపట్టాలి. దళితుల మీద దాడులు, వివక్ష, నేరాలు జరిగితే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి ఇప్పటికే సంకేతాలు పంపించారు. దానికి కావాల్సిన వ్యవస్థాగతమైన ఏర్పాట్లు చేయాలి. నిజానికి దళితుల వెనుకబాటుకు పేదరికం అతి చిన్న కారణం, ప్రధానమైన సమస్య అభద్రత, కుల వివక్ష, అస్పృశ్యత, వేధింపులే. ఎటువంటి సామాజిక వివక్షలేని సమాజాన్ని నిర్మించడానికి ఇప్పటికే పౌరహక్కుల చట్టంతో పాటు, అత్యాచారాల నిరోధక చట్టం ఉన్నాయి. వాటిని సక్రమంగా అమలు చేసే పటిష్ఠ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇప్పుడున్న యంత్రాంగంతో ఈ లక్ష్యం నెరవేరడం కష్టమే. దీనికి రైతుబంధు లాంటి ఒక సమాంతర సంధాన వ్యవస్థ ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు చెబుతున్నది చేసి చూపినట్లయితే నిజంగానే దేశానికి ఆదర్శవంతమైన దళిత బంధు అనిపించుకుంటారు.
-డా. రాహుల్ రాజారామ్