అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇక్కడ గురువారం ఒక్క రోజే ఏకంగా 1,09,824 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి గడిచిన వారం రోజుల్లో అమెరికాలో సగటున రోజుకు 98,518 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు.
అంటే వారం రోజులుగా రోజుకు సుమారు లక్ష కరోనా కేసులు రికార్డయ్యాయన్నమాట. మూడు వారాల క్రితంతో పోల్చుకుంటే ఈ కరోనా కేసులు 277శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఫిబ్రవరి 14 నుంచి ఇంతలా కరోనా కేసులు పెరగడం ఇదే తొలిసారి. కరోనా మరణాలు కూడా చాా వేగంగా పెరుగుతున్నాయి. గురువారం నాడు కొత్తగా 535 కరోనా మరణాలు నమోదయ్యాయి.
గడిచిన వారం రోజుల్లో సగటున 426 కరోనా మరణాలు నమోదైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇది మూడు వారాల క్రితంతో పోల్చుకుంటే 58శాతం ఎక్కువని అధికారులు చెప్తున్నారు. కొత్తగా పెరుగుతున్న కరోనా కేసుల్లో 93శాతం డెల్టా వేరియంట్ వల్లే అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. దీనిపై సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ వెలెన్స్కీ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్లు పనిచేసినప్పటికీ ఇవి వైరస్ వ్యాప్తిని నిరోధించలేకపోతున్నాయని చెప్పారు.