తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చేయూతను అందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీ.జే. రావుకు సూచించారు. గురువారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్‌తో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీ.సీ. ప్రొ. బీ.జే. రావు సమావేశమయ్యారు. ఆయన ఇటీవలే వీ.సీ.గా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా అభివృద్ధి, విద్యా విధానంలో అమలు చేయాల్సిన నూతన విధానాలు, విద్యార్థుల అంచనాలకు అనుగుణంగా అనుసరించాల్సిన విధానాలపై వారు చర్చించారు.ఈ భేటీలో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చొప్పున ఉన్న యూనివర్సిటీలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేయూతను అందించాలని సూచించారు.
నూతన విద్యా విధానంలో బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అందు కోసం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చొరవ తీసుకోవాలని, రీసెర్చ్ వంటి అంశాలపై సహకారాన్ని అందించాలనీ వినోద్ కుమార్ కోరారు. తన వైపు నుంచి అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని బీ.జే. రావు అన్నారు.ఈ సందర్భంగా బీ.జే. రావును వినోద్ కుమార్ సన్మానించారు. ఈ భేటీలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పీ. వెంకట రమణ కూడా పాల్గొన్నారు.