రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, పంజాబ్ సీఎం ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రమేయం ఏమీ ఉండదని తెలిపారు. ప్రజా జీవితం నుంచి తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌కు ఆయన లేఖ రాశారు. ‘ప్రజా జీవితంలో క్రియాశీల పాత్ర నుండి నేను తాత్కాలిక విరామం తీసుకోవాలనుకుంటున్న సంగతి మీకు తెలిసిందే.
నా ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని, మీ ప్రిన్సిపల్ సలహాదారుగా నేను బాధ్యతలు చేపట్టలేకపోయాను. నా భవిష్యత్తు కార్యాచరణపై నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ బాధ్యతల నుండి నన్ను విముక్తి చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఈ లేఖ రాస్తున్నాను’ అని ప్రశాంత్ కిషోర్ అందులో పేర్కొన్నారు.
పంజాబ్ కాంగ్రెస్‌లో ఓ వైపు అంతర్గత పోరు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తీసుకున్న ఈ నిర్ణయం సీఎం అమరీందర్ సింగ్‌ను నిరాశపర్చింది. ఈ ఏడాది మార్చిలో ప్రశాంత్ కిషోర్‌ను తన ప్రిన్సిపల్ సలహాదారుగా అమరీందర్ సింగ్ నియమించారు. ఆయనకు కేబినెట్ హాదా కూడా కల్పించారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఆ బాధ్యతలను చేపట్టలేదని తెలుస్తున్నది.