‘దళితబంధు’ పథకాన్ని హుజూరాబాద్ నుంచి ప్రారంభించటం గురించి చాలా చర్చ జరుగుతున్నది. ఈ పథకం ఉప ఎన్నిక లబ్ధి కోసమన్నది విమర్శ కాగా, పథకానికి నిధులు గత బడ్జెట్‌లోనే కేటాయించామన్నది ప్రభుత్వ వివరణ. అదే సమయంలో, ఒకవేళ ఎన్నికల ప్రయోజనానికి ఒక చర్య తీసుకుంటే తప్పేమిటనే మౌలికమైన ప్రశ్నను కేసీఆర్ లేవనెత్తుతున్నారు. ఇందుకెవరూ జవాబివ్వటం లేదు. ఇది ఎప్పటికైనా చర్చించవలసిన ప్రశ్నే.
దళితుల పట్ల కేసీఆర్‌కు గల తపన గురించి అతికొద్ది మందికి తెలిసిన మాట ఒకటి చెప్తాను. 2014లో టీఆర్‌ఎస్ మొదటి ఎన్నికల మేనిఫెస్టో రచనపై చర్చ జరిగినప్పుడు, దళితుల వెనుకబాటుతనం, వారి అభ్యున్నతి కోసం పథకాల గురించి పదే పదే గట్టిగా మాట్లాడేవారు. ఆ సమావేశంలోని వామపక్ష భావజాలవాదులకు మించి చర్చించేవారు. ఒక దశలోనైతే,ప్రతి ఒక్క పథకం దళితవాడల నుంచే మొదలుకావాలన్నారు.
రాజకీయ వాదోపవాదాలు జరిగేటప్పుడు, ఒక్కోసారి అనూహ్యమైన కోణాలు ముందుకువస్తాయి. అధికారంలో ఉన్న పార్టీ ఒకవేళ ఎన్నికల ప్రయోజనం కోసం ఒక చర్య తీసుకుంటే తప్పేమిటన్న కేసీఆర్ ప్రశ్న అటువంటిదే. ఆ ప్రశ్నను లేవనెత్తి ఆయన అందరినీ ఉలిక్కిపడేలా చేశారు. ఇది దళితబంధుకు, హుజూరాబాద్‌కు మాత్రమే పరిమితమైనది కాదు. ఎవరై నా భావించి అంతవరకే చర్చించి వదిలివేస్తే అది హ్రస్వదృష్టి అవుతుంది. కానీ ఈ ప్రశ్నకు మన రాజకీయ చరిత్రతో సంబంధం ఉంది. భవిష్యత్ చరిత్రతోనూ ఉండబోతున్నది. అంతేకాదు. మన రాజకీయ వ్యవహరణలోని కప ట ధోరణులతో, నిజాయితీతో కూడా సంబంధం ఉంది.
చర్చలోకి వెళ్లేముందు రెండు ప్రశ్నలు వేసుకుందాము. అధికారంలో గలవారు రాజకీయ లబ్ధి కోసమని ఒక చర్య తీసుకోవటం గతంలో ఎప్పుడూ జరగలేదా? ఏ పార్టీ కూడా తీసుకోలేదా? ఇకముందు ఎవరూ ఆ పని చేయబోరా? దీనిపై విమర్శకులతో సహా అందరికీ ముందుగా ఒక సైద్ధాంతిక స్పష్టత అవసరం. ఇటువంటిది లోగడ జరిగింది, లేదా జరగలేదనే విషయమై ఒక స్పష్టత కావాలి. ఇకముందు తాము ఆ పని చేస్తాము, లేదా ససేమిరా చేయబోము అనేదానిపై మరొక స్పష్టత రావాలి. అప్పుడు ఆ రెండు స్పష్టతలతో ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఒక ప్రకటన చేసి ప్రజలకు తెలియజెప్పాలి. అది జరిగితే, దళితబంధు-హుజూరాబాద్ ప్రశ్నపై వారి మాటలకు ఒక ప్రాతిపదిక, ఒక విలువ ఏర్పడతాయి. ప్రతిపక్షాలను, ఇతర విమర్శకులను అట్లుంచితే ఇటువంటి విషయాల్లో వాస్తవాలు ఏమిటో సాధారణ ప్రజలకు అనుభవపూర్వకంగా తెలుసు. రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శకులు పైకి ఏమన్నా, అవే వాస్తవాలు వారికి సైతం తెలిసినవే. వారి మాటలకు మీడియాలో హడావుడి ప్రచారం ఎంత లభించినా, ప్రజల దృష్టిలో విలువ లేకపోవటానికి కారణం అదే.
ఇప్పుడు మరొక విధమైన ప్రశ్నలు వేసుకుందాము. ప్రజాస్వామిక వ్యవస్థలో పార్టీలు, ప్రభుత్వాలు ప్రజలకు హామీలు ఇవ్వటం, పథకాలు ప్రవేశపెడుతుండటం ఎన్నికల సమయంలో మాత్రమే జరుగుతుందా? అదొక నిరంతర ప్రక్రియ కాదా? అవి ఉప ఎన్నికలు కావచ్చు, సాధారణ ఎన్నికలు కావచ్చు. మేనిఫెస్టోలు, బడ్జెట్లు, ఇతరత్రా హామీలు, ఎన్నికల కాలపు ప్రత్యేక పథకాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మొదలైన వాటన్నింటి స్వరూప స్వభావాలు ఇవే కావా? వాటినుంచి ఆశించే ప్రయోజనాలు ఇవే కావా? కాదని ప్రతిపక్షాలు, ఇతర విమర్శకులు అనగలరా?
ఇటువంటివి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేందుకు నిజాయితీ అవసరం. ధైర్యం అవసరం. విమర్శలు, ఆరోపణలదేమున్నది గనుక. ఎవరేదైనా మాట్లాడవచ్చు. మీడియాలో అన్నీ ప్రసారమవుతుంటాయి. దాని అర్థం అందులో నిజాయితీ, ధైర్యం ఉన్నాయని కాదు. ఇప్పుడు కేసీఆర్ అన్న మాటలను చూద్దాము. అందులో చూడవలసినవి రెండున్నాయి. తను చెప్పిన దానిలో నిజాయితీ, ధైర్యం ఉన్నాయా లేదా. లేక అందులో కపటం, ద్వంద్వనీతి ఏమైనా ఉన్నాయా అనేది మొదటిది. దళితబంధు పథకం దళితులకు సంబంధించింది అయినందున, ఆ సామాజిక వర్గం అభ్యున్నతి పట్ల ఆయనకు నిజమైన చిత్తశుద్ధి ఉందా లేక అది ఒక ఉప ఎన్నికల కోసమో, ఇంకా అనాలంటే ఎన్నికల కోసమో నటిస్తున్న ప్రేమా అనేది రెండవది.
ఇంతకూ కేసీఆర్ అన్నదేమిటి? తమది
రాజకీయ పార్టీ. ఏ పార్టీ అయినా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తుంది. టీఆర్‌ఎస్ సన్యాసుల పార్టీ కాదు, ‘దళితబంధు’ పథకం ద్వారా కూడా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తాము. అందులో తప్పేమిటి? యథాతథంగా ఇందులో అన్ని పార్టీలు మొదటినుంచి ఏమి చేస్తున్నాయో, మునుముందు కూడా ఏమి చేయగలవో ఆ పరిస్థితినే కపటం లేకుండా నిజాయితీగా ప్రకటించే నిజాయితీ, ధైర్యం ఉన్నాయి. వాస్తవానికి ఆయనది మొదటినుంచి కూడా ఇదే శైలి. ప్రజలకు తనను ప్రీతిపాత్రుడిని చేసిన లక్షణాలలో ఇది ఒకటి. ఇతరులు కపటులు గనుక నటిస్తారు.
ఇక దళితుల పట్ల కేసీఆర్‌కు గల తపన గురించి అతికొద్ది మందికి తెలిసిన మాట ఒకటి చెప్తాను. 2014లో టీఆర్‌ఎస్ మొదటి ఎన్నికల మేనిఫెస్టో రచనపై చర్చ జరిగినప్పుడు, దళితుల వెనుకబాటుతనం, వారి అభ్యున్నతి కోసం పథకాల గురించి పదే పదే గట్టిగా మాట్లాడేవారు. ఆ సమావేశంలోని వామపక్ష భావజాలవాదులకు మించి చర్చించేవారు. ఒక దశలోనైతే, ప్రతి ఒక్క పథకం దళితవాడల నుంచే మొదలుకావాలన్నారు. వారికి మూడెకరాల భూమి వంటి ఆలోచన భూమి లభ్యత లేనందువల్ల ఆచరణలో ముందుకుసాగకపోవచ్చు. కానీ అదే అన్నింటికి గీటురాయి కాదు. భూమి లభ్యత సమస్యను మహబూబ్‌నగర్ జిల్లా మార్లబీడు గ్రామ దళితులు స్వయంగా 2016 అక్టోబర్‌లోనే ఈ రచయిత దృష్టికి తెచ్చి తమకు ప్రత్యామ్నాయాలు చాలునన్నారు. వారిలో కేసీఆర్ పట్ల విశ్వాసం కన్పించింది. విమర్శకుల మాటలపై విలువ కన్పించలేదు.
– టంకశాల అశోక్