హుజురాబాద్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ విజయం తథ్యమని, 50 వేల మెజార్టీతో గెలుపును సి ఎం కేసీఆర్ కు బహుమతిగా అందివ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. సోమవారం హుజురాబాద్ రూరల్, టౌన్ కు సంబంధించిన ముఖ్య కార్యకర్తల, ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తల సమావేశం సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి రావు మాట్లాడుతూ హుజురాబాద్ లో టిఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని కోరారు. గత వేసవిలో కాకతీయ కాలువ ద్వారా 9 నెలల పాటు నిరంతరంగా ఆయకట్టుకు సాగు నీటి సరఫరా జరిగిందని, ఆ ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి సి ఎం కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. నిరంతర నాణ్యమైన విద్యుట సరఫరా, రైతు బంధు, రైతు భీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, పింఛన్లు, దళిత బంధు, మిషన్ భగీరథ, కాకతీయ వంటి పథకాలు ప్రజలవద్దకు తీసుకుపోవాలని కోరారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ లో అభివృద్ధిని విస్మరించి, నిర్లక్ష్యం చేసారని, ఆయన 17 ఏళ్ల లో టిఆర్ఎస్ తో బాగుపడ్డారని, కమలాపూర్, శామీర్పేట, మూసాయిపేట, హుజురాబాద్ లలో ఇళ్ళు నిర్మాణం చేసుకున్న ఈటెల రాజేందర్ తన నియోజకవర్గంలో 4 వేల ఇళ్ళు పేదలకు మంజూరైనా ఎందుకు నిర్మాణం చేయలేదని ప్రశ్నించారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, ప్రతి పేద వారి అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తామన్నారని, బీజేపీ ప్రభుత్వం ఇస్తుందా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలన లో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నందుకు బీజేపీ కి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 1 లక్షా 32 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మరో 70 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తున్న ట్లు తెలిపారు. ఇప్పటి వరకు 15 వేల పరిశ్రమలు తెలంగాణ లో వచ్చినట్లు చెప్పారు. ఈ డబ్ల్యూ ఎస్ ద్వారా రూ.8 లక్షల ఆదాయం ఉన్న వారికి కూడా ఉద్యోగాలు, విద్యావకాశాలు ఉండే విధంగా ప్రభుత్వం క్యాబినేట్ లో తీర్మానించినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలను అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ రెండు పట్టణాల తో కలిపి అర్బన్ డెవలప్ కమిటీ ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, వై.సునీల్ రావు, ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, TRS విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు Gellu Srinivas Yadav గారు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు వకుళ భరణం కృష్ణ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.