సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఫలితాలు ( CBSE results ) విడుదలయ్యాయి. జూలై 30న 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన బోర్డు ఇవాళ 10వ తరగతి ఫలితాలను కూడా వెల్లడించింది. కరోనా మహమ్మారి విస్తృతి కారణంగా CBSE ఈసారి పరీక్షలు నిర్వహించలేదు. విద్యార్థులు గత ఏడాది కాలంగా రాసిన యూనిట్ పరీక్షలు, ప్రాక్టికల్స్, ప్రీ బోర్డు, మిడ్ టర్మ్ పరీక్షల్లో సాధించిన ఫలితాల ఆధారంగా వార్షిక పరీక్షల మార్కులను కేటాయించారు.
కాగా, మొత్తం 21.5 లక్షల మంది విద్యార్థులు CBSE 10వ తరగతి పరీక్షలు రాయగా వారిలో 99.04 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది నమోదైన ఉత్తీర్ణతా శాతంతో పోల్చితే ఇది దాదాపు 8 శాతం ఎక్కువ. గత ఏడాది 91.46 శాతం మంది CBSE 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. తాజా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలుర కంటే బాలికలు 0.35 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. బాలురు 98.89 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 99.24 శాతం ఉత్తీర్ణులయ్యారు.
బెంగళూరు రీజియన్ (99.96 శాతం), చెన్నై రీజియన్ (99.94 శాతం) ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక అత్యల్పంగా 90.54 శాతం ఉత్తీర్ణతతో గువాహటి రీజియన్ చివరి స్థానంలో ఉన్నది.