నాగార్జునసాగర్ నియోజకవర్గ కేంద్రం హాలియాకు సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కేసీఆర్ సాగర్ పర్యటనకు బయల్దేరారు. హాలియాకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
హాలియా మార్కెట్‌యార్డులో ప్రజాప్రతినిధులు, అధికారులతో లిఫ్ట్ పథకాల పనుల పురోగతిపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా నెల్లికల్, ఇతర లిఫ్టు పథకాల నిర్మాణంపై సమీక్షతోపాటు గిరిజన భూముల సమస్య, సాగర్‌లో ఎన్‌ఎస్పీ క్వార్టర్ల కేటాయింపు అంశం, డిగ్రీ కాలేజీ భవనం, అంతర్గత రహదారులు, వ్యవసాయభూములకు వెళ్లే దారుల్లో కాల్వలపై బ్రిడ్జిల నిర్మాణం, వివిధ వర్గాలకు షాదీఖానాల ఏర్పాటు లాంటి అంశాలపై సమీక్ష జరగవచ్చని తెలుస్తున్నది. అనంతరం స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ ఇంట్లో భోజనం చేసి, హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్ అన్ని ఏర్పాట్లు చేశారు.