పత్తి అమ్మకాల్లో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిన్న మొన్నటి వరకు ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌ను వెనక్కినెట్టి తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నది. 2020-21లో దేశవ్యాప్తంగా పత్తి అమ్మకాల్లో తెలంగాణ నంబర్ 1గా నిలిచింది.
ఒక్క మన రాష్ట్రం నుంచే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఏకంగా 1.78 కోట్ల క్వింటాళ్ల (178.55 లక్షల క్వింటాళ్లు) పత్తిని కొనుగోలు చేయటం గమనార్హం. దేశంలో ఇదే అత్యధికమని సీసీఐ ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. దేశంలో పత్తి కొనుగోళ్లపై రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.
దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి పత్తిని కొనుగోలు చేసినట్టు పేర్కొన్నది. సీసీఐ మహారాష్ట్ర నుంచి 91.98 లక్షల క్వింటాళ్లు, హర్యానా నుంచి 55.49 లక్షల క్వింటాళ్లు, రాజస్థాన్ నుంచి 47.83 లక్షల క్వింటాళ్లు, పంజాబ్ నుంచి 28.14 లక్షల క్వింటాళ్లు, గుజరాత్ నుంచి 21.79 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్టు వెల్లడించింది.