ధరణి పోర్టల్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. పోర్టల్ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారి లక్ష రిజిస్ట్రేషన్ల మార్క్‌ను అధిగమించింది. జూలైలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు లక్షకుపైగా జరిగాయి. స్లాట్ బుకింగ్స్‌లోనూ జూలై టాప్‌లో నిలిచింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ & మ్యుటేషన్, భాగ పంపకం (పార్టిషన్), వారసత్వం (సక్సెషన్) కలిపి 1.08 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి.
నవంబర్ 2న ధరణి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యధికం. పెండింగ్ మ్యుటేషన్లు (11,295), నాలా కన్వర్షన్లు (3,344) అదనం. మొత్తంగా జూలైలో 1.22 లక్షల లావాదేవీలు జరిగాయి.
రిజిస్ట్రేషన్, సక్సెషన్, పార్టిషన్‌కు 1.20 లక్షల స్లాట్లు బుక్ అయ్యాయి. ఒక నెలలో రిజిస్ట్రేషన్ల కోసం జరిగిన స్లాట్‌బుకింగ్స్‌లో ఇదే రికార్డు. పెండింగ్ మ్యుటేషన్లు, నాలా కలిపితే జూలైలో 1.35 లక్షలకు పైగా స్లాట్లు బుక్ అయ్యాయి. ధరణి వచ్చిన తర్వాత భూమి హక్కుల మార్పిడి అత్యంత సులభంగా, వేగంగా జరుగుతుండటంతో రికార్డు స్థాయిలో లావాదేవీలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.