తెలంగాణ రాష్ట్రంలో సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం ఉండటంతో ఆర్థికాభివృద్ధి శరవేగంగా సాగుతున్నదని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఏడేండ్లుగా పల్లెలు, పట్టణాలు సమతుల అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల అనుకూల విధానాల వల్ల 15 వేల పరిశ్రమలకు పైగా రాష్ర్టానికి వచ్చాయని పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామికీకరణ సమానస్థాయిలో శరవేగంగా దూసుకుపోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమర్థ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం ఉన్నందు వల్లనే ఇది సాధ్యమవుతున్నదని చెప్పారు.
షాద్‌నగర్ నియెజకవర్గంలోని మేకగూడలో పొకర్ణ ఇంజినీర్డ్ స్టోన్ లిమిటెడ్ సంస్థ నెలకొల్పిన అత్యాధునిక క్వాంట్రా క్వార్ట్ గ్రానైట్ ప్లాంటును మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలకు అనుమతులు ఇవ్వటంలో తెలంగాణ రాష్ట్రం విప్లవమే తెచ్చిందని అన్నారు. పారిశ్రామికీకరణకు, ఐటీ రంగానికి, ఉపాధి కల్పనతోపాటు వ్యవసాయం, కులవృత్తుల అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వ్యయసాయం, పారిశ్రామికీకరణ సమ్మిళితంగా అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. టీఎస్ ఐ-పాస్ విధానంతో రాష్ట్రంలో పరిశ్రమ స్థాపనను అత్యంత సులువుగా మార్చామని గుర్తుచేశారు.
పరిశ్రమ పెట్టాలంటే ఎటువంటి అనుమతులు అవసరం లేదని, దరఖాస్తుచేసుకొని నిర్మాణం చేపట్టవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ వ్యాపారాలు నడుస్తున్నాయో ప్రభుత్వానికి తెలిసేందుకు మాత్రమే దరఖాస్తు అవసరమవుతున్నదని పేర్కొన్నారు. దరఖాస్తుచేసిన 15 రోజుల్లో అనుమతులు రాకుంటే 16వ రోజునుంచి అనుమతి మంజూరైనట్టే భావించాల్సి (డీమ్డ్ అప్రూవల్) ఉంటుందని వివరించారు. పరిశ్రమల అనుమతి మంజూరులో అకారణంగా జాప్యం చేసిన అధికారికి రోజుకు రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తామని చెప్పారు. ఇలాంటి చట్టం దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. 2015 నవంబర్‌లో టీఎస్ ఐ-పాస్ చట్టం అమల్లోకి రాగా, గడచిన ఏడేండ్లలో 15 వేల పరిశ్రమలు, రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. వీటిద్వారా 15 లక్షల పైచిలుకు మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.