Home / SLIDER / కన్నుల పండుగలా యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌

కన్నుల పండుగలా యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌

తెలంగాణ  రాష్ట్రంలో ఏ కాలంలోనైనా విద్యుత్తు కొరత అనే పదం వినపడకుండా భవిష్యత్తును తీర్చిదిద్దేందుకే రాష్ట్రప్రభుత్వం యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం నిర్మాణాన్ని చేపట్టింది. నల్లగొండ జిల్లా దామరచర్ల సమీపంలో టీఎస్‌జెన్‌కో సుమారు 6,000 ఎకరాల్లో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఇది. కరోనా సంక్షోభ కాలంలోనూ 6,000 వేల మందికిపైగా కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. 800 మెగావాట్ల చొప్పున 5 యూనిట్ల ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు నిర్దేశించిన యాదాద్రి అల్ట్రా సూపర్‌ థర్మల్‌ విద్యుత్తు కేంద్రం ఒక విద్యుత్తు నగరంగా రూపుదిద్దుకొంటున్నది. రైల్వే ట్రాక్‌ నుంచి మొదలుకొని నీటి రిజర్వాయర్‌, బొగ్గు నిల్వ కేంద్రం, కూలింగ్‌ టవర్లు, చిమ్నీలు, ఈఎస్పీ, బాయిలర్‌, పవర్‌ హౌజ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌యార్డ్‌, స్విచ్‌యార్డ్‌.. ఇలా అన్ని పనులను ఏకకాలంలో పూర్తిచేసేలా పనులు సాగుతున్నాయి. ఇటీవల కొవిడ్‌-19 కారణంగా పనులు కాస్త నెమ్మదించినా ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటున్నాయి. పనులు పూర్తిస్థాయిలో మొదలైతే ఇక్కడ రోజూ 12,000 మంది కార్మికులు పనిచేస్తారు. 2,500 మంది రెగ్యులర్‌ ఉద్యోగులకు క్వార్టర్లు, ప్రత్యక్షంగా 5 వేలమంది, పరోక్షంగా మరో 20 వేల మంది మొత్తంగా సుమారు లక్ష మంది జనాభా ఉండేలా దామరచర్ల త్వరలో అభివృద్ధి చెందనున్నది. రాష్ట్ర సాగునీటి అవసరాలు తీర్చడంలో కాళేశ్వరం ప్రాజెక్టులాగే విద్యుత్తు అవసరాలను తీర్చడంలో యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ పెద్దన్న పాత్ర పోషించనున్నదని విద్యుత్తు రంగ నిపుణులు చెప్తున్నారు. ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే రాష్ట్రప్రభుత్వం విద్యుత్తు కోసం ఇతరులపై ఆధారపడే అవకాశం ఉండదని అంచనావేస్తున్నారు.

రూ. 30 వేల కోట్లతో భారీ ప్రాజెక్టు
————————————–
సమీపంలోనే కృష్ణా నది ఉండటం, అందుబాటులో పెద్ద ఎత్తున భూములు, కావాల్సినంత బొగ్గును తరలించేందుకు రైల్వేలైను ఉండటంతో దామరచర్ల (వీర్లపాలెం గ్రామం పరిధి) వద్ద ఈ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2015 జూన్‌ 8న శంకుస్థాపన చేశారు. రూ.29,965.48 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 2017 అక్టోబర్‌లో ప్రారంభమయ్యాయి. ఇందులో అతి ముఖ్యమైన విద్యుత్తు ప్లాంటు నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు రూ.20,379 కోట్లకు అప్పగించారు. మొత్తం 5,555.08 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టుకోసం సేకరించారు. పర్యావరణ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా బూడిద, ఇతర వాయువులు ఇసుమంత కూడా బయటకు రాకుండా (జీరో పొల్యూషన్‌) దీనిని నిర్మిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసమే ఏకంగా రూ.6 వేల కోట్ల వరకు ఖర్చుచేస్తుండటం గమనార్హం.

బొగ్గు రవాణా, నిల్వ
———————————-
భారీ ప్లాంటు కావటంతో దీనికి అదే స్థాయిలో బొగ్గు అవసరం. ప్లాంటుకు సింగరేణి నుంచి ఏటా 14 మిలియన్‌ టన్నుల జీ9 గ్రేడ్‌ బొగ్గును కేటాయించారు. రోజూ ఒక్కో యూనిట్‌ (800 మెగావాట్లు)కు సుమారు 8,000 టన్నుల బొగ్గు అవసరం. మొత్తం ఐదు యూనిట్లకు కలిపి రోజుకు 40 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుంది. బొగ్గు రవాణా కోసం భారీ కోల్‌స్టాక్‌ యార్డ్‌ నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. సమీపంలోని విష్ణుపురం రైల్వే స్టేషన్‌ నుంచి విద్యుత్తు కేంద్రం వరకు 10 కిలోమీటర్ల దూరం సొంతంగా రైల్వే ట్రాక్‌ నిర్మిస్తున్నారు. ఒకేసారి 14 ర్యాక్‌లను దింపేందుకు వీలుగా 14 ట్రాక్‌లను ఏర్పాటుచేస్తున్నారు. మొత్తం ట్రాక్‌ పొడవు 46 కిలోమీటర్లు ఉంటుంది. చిన్న ముక్కలుగా పగలగొట్టిన 7.56 లక్షల టన్నుల బొగ్గును నిల్వచేసేందుకు యార్డును నిర్మిస్తున్నారు.

ప్రధాన ప్లాంటు..
———————————
థర్మల్‌ విద్యుత్తు కేంద్రంలో ప్రధానమైనవి ఈఎస్పీ (ఎలక్ట్రో స్టాటిక్‌ ప్రెసిపిటేటర్‌), బాయిలర్‌, పవర్‌ హౌజ్‌. వీటి నిర్మాణం కూడా వేగంగా సాగుతున్నది. అతి మృదువుగా ఉండే పౌడర్‌లా మార్చిన బొగ్గును సాధారణ గాలితో కలిపి (80 డిగ్రీల ఉష్ణోగ్రతతో) బాయిలర్‌లోకి పంపింగ్‌ చేస్తారు. ఫర్నేస్‌లో సుమారు 1,500 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. బాయిలర్‌ గోడలకు ఉండే ట్యూబుల్లో స్వచ్ఛమైన నీరు ఉంటుంది. బాయిలర్‌ మండుతుండటంతో ఈ ట్యూబులు 700-800 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉం టాయి. ట్యూబుల్లోని నీరు 400 డిగ్రీల వేడితో ఆవిరిగా మారి టర్బయిన్‌ను తిప్పుతుంది. టర్బయిన్‌ తిరిగినప్పుడే విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. టర్బయిన్‌ తిప్పి శక్తిని కోల్పోయిన నీటి ఆవిరి కండెన్సర్ల గుండా ప్రవహిస్తూ మళ్లీ నీరుగా మారుతుంది. ఇదే సమయంలో బాయిలర్‌ నుంచి వచ్చే గాలిని, బూడిదను ఈఎస్పీ ఫిల్టర్‌ చేస్తుంది. మధ్యలో అనేక ప్రక్రియల ద్వారా బూడిదను బయటకు తీసుకొస్తారు. దీనిని ఇటుకల తయారీకి, సిమెంటు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. ఈఎస్పీ పనులు సుమారు 60 శాతం, బాయిలర్‌ పనులు 40 శాతం పూర్తయ్యాయి.

కోర్టు కేసులతో ఆలస్యం
————————————–
ముందుగా నిర్ణయించిన ప్రకారం ప్లాంట్‌ నిర్మాణం ఇప్పటికే దాదాపుగా పూర్తవ్వాలి. కానీ భూసేకరణ ఆలస్యం అయింది. పర్యావరణ అనుమతులు 2017 జూన్‌లో వచ్చాయి. ఇదే సమయంలో కొందరు ప్లాంటును అడ్డుకొనేందుకు కోర్టుల్లో కేసులు వేశారు. ఈ అవాంతరాలన్నీ దాటుకొని పనులు మొదలవగానే కరోనా దెబ్బతీసింది. ప్రారంభంలో 8,000 మంది కార్మికులు పనిచేయగా, కరోనా ప్రభావంతో 1,500 మందే మిగిలారు. ప్రస్తుతం రెండోవేవ్‌ కూడా ముగియటంతో 6 వేల నుంచి 6,500 మంది కార్మికులు 24 గంటలపాటు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో జెన్‌కో అధికారులున్నారు.

భారీ రిజర్వాయర్‌..
————————————–
ప్రాజెక్టుకు కావాల్సిన నీటిని 22 కిలోమీటర్ల దూరంలోని నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌ నుంచి తరలించనున్నారు. ఏటా 6.60 టీఎంసీల నీరు ఈ ప్లాంటుకు అవసరం. సాగర్‌ టెయిల్‌ పాండ్‌ వద్ద పంపింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుచేసి పైపులైన్‌ ద్వారా నీటిని తరలిస్తారు. ఈ నీటిని నిల్వ చేసేందుకు ప్లాంటు వద్ద 10.8 లక్షల క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యంతో 95 ఎకరాల్లో భారీ రిజర్వాయర్‌ను నిర్మించారు. టెయిల్‌ పాండ్‌ నుంచి 208 క్యూసెక్కుల సామర్థ్యంతో పైప్‌లైన్లు వేస్తారు. ఈ నీటి నుంచే ప్లాంట్‌కు, ఇక్కడ పనిచేసే ఉద్యోగుల అవసరాలకు ఉపయోగిస్తారు.

ఆకాశాన్నంటే చిమ్నీలు
————————————–
థర్మల్‌ విద్యుత్తు కేంద్రంలో చిమ్నీలకు ప్రత్యేకత ఉంటుంది. బాయిలర్‌లో 1,500 డిగ్రీల వేడిని పుట్టించి నీటిని వేడిచేసి ఆవిరిగా మార్చిన తర్వాత వెలువడే వేడి గాలి, ఇతర వాయువులను దీని ద్వారా బయటకు వదులుతారు. ఇందులో ఎలాంటి విష వాయువులు ఉండవు. ఈ చిమ్నీలను 275 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. భూ ఉపరితలంపై 34 మీటర్ల వ్యాసం ఉండే చిమ్నీలు, 275 మీటర్ల ఎత్తులో 21 మీటర్ల వ్యాసంతో ఉంటాయి. ప్లాంటులో మొత్తం మూడు చిమ్నీలు నిర్మిస్తున్నారు. ఒక్కో చిమ్నీని రెండు యూనిట్లతో అనుసంధానం చేస్తారు. మూడో చిమ్నీని ఐదో యూనిట్‌కు ఉపయోగిస్తారు. ఈ చిమ్నీలను ఆనుకొనే ఎఫ్‌జీడీ (ఫ్లూ గ్యాస్‌ డీ సల్ఫరైజేషన్‌) ప్లాంట్లను కూడా నిర్మిస్తున్నారు. దీనివల్ల సల్ఫర్‌ లాంటి వాయువులు వాతావరణంలోకి వెలువడకుండా అడ్డుకోవచ్చు. ఈ అత్యంత అధునాతనమైన టెక్నాలజీ వాయువులను పూర్తిగా సల్ఫర్‌ రహితంగా మార్చుతుంది.

భారీ యంత్రాలు
———————————
ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం భారీ యంత్రాలను వాడుతున్నారు. భూమిని చదును చేసేందుకు 250కి పైగా టిప్పర్లు, పొక్లెయిన్లు పనిచేస్తున్నాయి. రాత్రిపూట కూడా పనులు సాఫీగా సాగేందుకు రెండు 11 కేవీ సబ్‌స్టేషన్లు, ఒక 33 కేవీ సబ్‌స్టేషన్‌ నెలకొల్పారు. సుమారు 350 మంది జెన్కో ఉద్యోగులు, ఇంజినీర్లు, బీహెచ్‌ఈఎల్‌ తరఫున మరో 150 మంది ఇంజినీర్లు ఇక్కడ నిరంతరం పనిచేస్తున్నారు. పనులను వేగంగా పూర్తిచేసేందుకు 30 ఎక్స్‌కవేటర్లు, 100 డంపర్లు, 500 టన్నుల సామర్థ్యం ఉన్న క్రేన్లు 4, అలాగే 250 టన్నుల సామర్థ్యం ఉన్న క్రేన్లు 6, వీటికి అదనంగా 20 ఇతర క్రేన్లు, 15 భారీ జేసీబీలు, 16 కాంక్రీట్‌ మిక్సింగ్‌ ప్లాంట్లు, 150 రవాణా వాహనాలు, 20కిపైగా వాటర్‌ ట్యాంకర్లు, 10 బూమ్‌ పేసర్లు (కాంక్రీట్‌ వేసే యంత్రాలు) నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. ఈ విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి సుమారు 10 లక్షల క్యూబిక్‌మీటర్ల మేర కాంక్రీట్‌, లక్షల టన్నులకుపైగా స్టీలు, 5.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక, 3.5 లక్షల టన్నుల సిమెంట్‌ వాడుతున్నారు. కాలనీతోపాటు ఇతర నిర్మాణాలను పరిగణనలోకి తీసుకుంటే ముడి పదార్థాలు మరింత పెరుగుతాయి.

కూలింగ్‌ టవర్లు
——————————-
మొత్తం ఐదు యూనిట్లకు ఐదు కూలింగ్‌ టవర్లను నిర్మిస్తున్నారు. ఇవి కూడా భారీగానే ఉంటాయి. సుమారు 200 మీటర్ల ఎత్తుండే ఈ టవర్లు భూ ఉపరితలంపై 145 మీటర్లు, 200 మీటర్ల ఎత్తులో 88 మీటర్ల వ్యాసంతో ఉంటాయి. కూలింగ్‌ టవర్లకు గంటకు 90 వేల క్యూబిక్‌ మీటర్ల నీటిని చల్లబరిచే సామర్థ్యం ఉన్నది. వీటి నిర్మాణం 40 శాతం పూర్తయ్యింది.

అతిపెద్ద కాలనీ నిర్మాణం
————————————–
ఈ విద్యుత్తు కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, ఇంజినీర్ల కోసం ఒక మేజర్‌ పంచాయతీ స్థాయిలోనే కాలనీని నిర్మిస్తున్నారు. 150-200 ఎకరాల్లో 2,500 క్వార్టర్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. 10 ఫ్లోర్ల చొప్పున మొత్తం 8 యూనిట్లు నిర్మిస్తారు. సుమారు 1,300 మంది ఓఅండ్‌ఎం సిబ్బంది కోసం డబుల్‌ బెడ్రూం క్వార్టర్లను నిర్మించనున్నారు. 750 మంది ఇంజినీర్లకు క్వార్టర్లు నిర్మిస్తారు. డీఈ స్థాయి వారికి ట్రిపుల్‌ బెడ్రూంలతో ఫ్లోర్‌కు 6 ఫ్లాట్లు చొప్పున 12 ఫ్లోర్లను నిర్మిస్తారు. ఏఈ స్థాయి ఇంజినీర్లకోసం ట్రిపుల్‌ బెడ్‌రూం ఫ్లాట్లను ఫ్లోర్‌కు 6 చొప్పున 10 ఫ్లోర్లలో క్వార్టర్లను నిర్మించనున్నారు. ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా క్వార్టర్లను నిర్మిస్తారు. కాలనీలో పాఠశాల, 50 బెడ్లతో దవాఖాన, ఇండోర్‌ స్టేడియం, జిమ్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ (ప్రొవిజన్స్‌ స్టోర్స్‌), హాస్టల్‌, గెస్ట్‌ హౌజ్‌, ల్యాండ్‌స్కేప్‌, పార్కు, వాకింగ్‌ ట్రాక్‌, స్విమ్మింగ్‌పూల్‌ లాంటివి భారీగా నిర్మించనున్నారు.

స్విచ్‌యార్డ్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ యార్డ్‌లు
————————————–
భారీ ప్లాంట్‌ను నడిపించడానికి విద్యుత్తు కూడా భారీగానే అవసరం. ఈ అవసరాలన్నీ చూసేందుకు స్విచ్‌ యార్డ్‌ ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్తులో సుమారు 5 శాతం సొంత అవసరాలకు ఉపయోగించుకుంటుంది. ఉత్పత్తి అయిన విద్యుత్తు 30 కేవీ స్థాయిలో ఉంటుంది. దీనిని 400 కేవీ స్థాయికి పెంచాలి. ఇందుకోసం ట్రాన్స్‌ఫార్మర్‌ యార్డ్‌ను ఉపయోగిస్తారు. 400 కేవీకి పెంచిన విద్యుత్తును దామరచర్ల, జనగామ, చౌటుప్పల్‌, డిండిలకు ఫీడర్ల ద్వారా పంపిస్తారు.
తెలంగాణ వెలుగుల సౌధం చకచకా రూపం దాల్చుతున్నది. వేలమంది చెమటచుక్కలతో అడుగూ అడుగూ పైగెస్తూ ఆకాశాన్ని అందుకొంటున్నది. కాళేశ్వరం తర్వాత అంతటి బృహత్తర సాంకేతిక అద్భుతం రాష్ట్రంలో నిర్మాణమవుతున్నది. ఐదువేల ఎకరాల్లో ఓ వెలుగుల పట్టణమే పురుడుపోసుకొంటున్నది. అదే ఆసియాలోనే అతిపెద్దదైన యాదాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్‌. దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయంతో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నాయి. 8 వేల మంది కార్మికులు, ఇంజినీర్లు, అధికారులు ప్రాజెక్టు నిర్మాణంలో అహోరాత్రులు కష్టపడుతున్నారు. ఈ ప్లాంటు నిర్మాణం పూర్తయితే ఉద్యోగులు, కార్మికులు, అధికారులు, ప్రజలు కలిసి లక్షమంది నివసించే పట్టణంలా దామరచర్ల పరిణామం చెందనున్నది. రాష్ట్రప్రభుత్వం

రాష్ట్ర విద్యుత్తు రంగానికి పెద్దన్న
————————————–
రాష్ట్రం విద్యుత్తు విషయంలో స్వయం సమృద్ధిగా ఉండాలని సీఎం కేసీఆర్‌ కోరిక. అందుకే రాష్ట్రం వచ్చిన మొదట్లోనే యాదాద్రి అల్ట్రా సూపర్‌ థర్మల్‌ కేంద్రాన్ని 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టాము. నిజానికి ఇప్పటికే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు. కోర్టు కేసులు, కరోనా కారణంగా ఆలస్యమైంది. దేశంలో ఒకేచోట 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన విద్యుత్తు ప్లాంట్లు రెండే ఉన్నాయి. అవికూడా ప్రైవేటు రంగంలో ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో చేపట్టింది మనది మాత్రమే. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రత్యక్షంగా 8 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర విద్యుత్తు రంగంలో పెద్దన్న పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
-దేవులపల్లి ప్రభాకర్‌రావు, టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ

పనులు వేగవంతం
————————–
ప్రాజెక్టు పనులు ఇప్పటికే చాలావరకు పూర్తి కావాల్సింది. భూసేకరణ, కోర్టు కేసులు, కరోనా వల్ల కొంత ఆలస్యమైంది. అయినా దేనికీ వెరవకుండా పనులు కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం 6,500 మంది రేయింబవళ్లు పనిచేస్తున్నారు. 2022 డిసెంబర్‌ నాటికి ఒక యూనిట్‌ను ప్రారంభించి, ఆ తర్వాత నెలకొకటి చొప్పున మిగతావి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2023 జూన్‌ నాటికి ప్లాంటు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఆసియాలోనే ఇంత సామర్థ్యంతో ఒకేచోట కట్టిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఇప్పటివరకు లేదు. చరిత్రలో నిలిచిపోయేలా దీనిని నిర్మిస్తున్నాం.
-సమ్మయ్య, సీఈ, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat