తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి కార్యక్రమాలు రూపొందిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు పెద్దిరెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఒక ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే అనుకున్న ప్లానింగ్ అమలు చేయాలన్నారు. ఒక పథకం ప్రారంభించామంటే.. దాని ఫలితం, ప్రతిఫలం, భవిష్యత్ ఫలాలు ఊహించి పకడ్బందీగా ప్లాన్ చేస్తేనే అభివృద్ధి అవుందన్నారు.‘‘హైదరాబాద్ లో గీత కార్మికుల పొట్టగొట్టి కల్లు దుకాణాలు బంద్ పెట్టిర్రు. చెట్ల రకాలు వసూలు చేసేవాళ్లు. రాష్ట్రం వచ్చినంక గౌడ సోదరులకు కల్లు దుకాణాలు తెరిపిచ్చినం. చెట్ల రకాలు మాఫీ చేశినం. కల్లు గీస్తూ చెట్టు మీదకెళ్లి కింద పడితే వారికి బీమా అందిస్తున్నం. గీత కార్మికులు, చేనేత కార్మికులు, గొర్రెల కాపర్లు, రజకులు, నాయి బ్రాహ్మణ, మత్స్యకారులు ఇలా ఎవరెవరికి ఏమేం చేయగలమో అవి చేస్తూ కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ఎంబీసీ వర్గాలకు చెందిన వారికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి.. బడ్జెట్ విడుదల చేశినం.
2014 ఎన్నికల కంటే ముందు చాలామందికి తెలంగాణ రాష్ట్రం వస్తదన్న నమ్మకమే లేదు. నేను చాలా స్పష్టంగా చెప్పిన. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కానుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని. ముందుగానే మేనిఫెస్టో తయారు చేయాలని చెప్పడం జరిగింది. కడియం శ్రీహరి మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. మేనిఫెస్టో రాస్తున్న క్రమంలో గోయల్ గారిని నేను అడిగాను. పేదవాళ్లకి పెన్షన్ ఇస్తం కరెక్టే.. కానీ ఎందుకు వారికి పెన్షన్ ఇస్తున్నం అని అడిగిన. ప్రభుత్వం అంటే ఏదో గుడ్డిగా చేసే పని కాదు. బాధ్యతతో చేయాలన్న ఉద్దేశ్యంతో ఆయనను ఆరోజు ఆ ప్రశ్న అడిగా. దానికి ఆయన పేదలను ఆదుకోవడానికి, వారికి అండగా ఉండడానికి పెన్షన్ ఇస్తాం అని చెప్పారు.
భర్తను కోల్పోయిన మహిళలకు, వయసు మీద పడిన వారికి, ఏ దిక్కూ లేని వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఏదో కొంత ఆదుకోవాలని ఇచ్చేదే పెన్షన్. మరి అప్పుడిస్తున్న పెన్షన్ ఎంత.. కేవలం రూ.200. అప్పటి ప్రభుత్వం ఇచ్చే రూ.200 దేనికి సరిపోతయి? ఇయింత 200 ఎందుకు ఇస్తున్నట్టు? రెండు పూటలు తినడానికి కూడా సరిపోతయా? అని గోయల్ ని అడిగిన. దానికి ఆయన బియ్యం, పప్పు, ఉప్పు, నూనె అన్ని లేక్కలేసి.. రూ.670 అయితే సరిపోతయ్ సార్ అని సమాధానం చెప్పిండు. ఈ పేదొళ్ల విషయంలో కూడా కొసరాల్నా.. రూ.1000 ఫిక్స్ చేయండి అని పేదలకు ఇచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలు చేశినం.
అప్పటికి తెలంగాణ అనేది ఒక రాష్ట్రంగా లేదు. రాష్ట ఎట్ల నడవాలి? ఆదాయం ఎంత? వనరులేంటి అనేది అప్పటికి స్పష్టత లేదు. అయితే.. అప్పటికి పాత సీఎం వాడిన కార్లు నల్లగ ఉండేవి. నాకు నల్లరంగు నచ్చదు. మా ఐజీ అధికారిని సలహా అడిగితే.. కొత్త కార్లు కొందాం సార్ అన్నరు. కానీ అప్పుడప్పుడే కొత్త సంసారం. కొత్త కార్లు కొనే పని లేకుండా ఏమైనా ఆలోచనా ఉందా అని అడిగితే.. ఆయన నల్ల కలర్ తీసేశి.. తెల్ల కలర్ ఏపియొచ్చు సార్ అని సలహా ఇచ్చిండు. ఉన్న కార్లన్నీ మూడోకంటికి తెల్వకుండా షెడ్డుకు పంపి తెల్లకలర్ ఏపిచ్చినం. ఈ విషయం అప్పటి గవర్నర్ నరసింహన్ గారికి తెలిసి.. ఏంటండీ సీఎం గారూ.. మీరు చాలా పిసినారి ఉన్నరు. నల్ల కలర్ తీసేశి.. తెల్ల కలర్ ఏసుకునే కంటే కొత్త కార్లు కొనుక్కోవచ్చు కదా అన్నరు. ఇప్పటి పరిస్థితులల్ల కొత్త కార్లు ఎందుకు సార్. కొంతకాలం తర్వాత సూద్దాం అని చెప్పిన. అప్పుడు పరిస్థితిని బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
అప్పుడు కార్లు మార్చడం అనేది అత్యవసరం కాదు. ఉన్న దాంట్లో ముందుకు సాగాలి. ఒక ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం అంది. ప్రతి విషయంలో కూడా ఎంతో మందుచూపుతో ఆలోచిస్తూ వచ్చినం కాబట్టి ప్రస్తుతం చాలా విషయాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచింది. ఎంత జాగ్రత్తగా నడిస్తే ఇంత ముందుకు వస్తామో అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది నేను స్వయంగా చెప్తున్న విషయం కాదు. పార్లమెంటులో కేంద్ర మంత్రులే ఫలానా విషయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది అని గొంతెత్తి చెప్తున్నరు. ప్రతి సమస్యను తీసుకొని వాటి పరిష్కారానికి కార్యచరణ రూపొందించినం.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.