దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదని.. ఆరునూరైనా 100 శాతం అమలుచేసి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని, మహాయజ్ఞంలా దళితబంధును చేపట్టినట్లు సీఎం తెలిపారు. దళితుల అభివృద్ధికి లక్ష కోైట్లెనా ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. కరోనా వల్ల దళిత బంధు ఏడాది ఆలస్యమైందన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పెద్దిరెడ్డిని పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం చాలా సంతోషం అన్నారు. పెద్దిరెడ్డి తనకు సన్నిహిత మిత్రుడని, ఇరువురం కలిసి ఒకేసారి మంత్రులుగా పనిచేసినట్లు తెలిపారు. ప్రజాసంక్షేమంలో భాగస్వామ్యం కావడానికే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు.ఎన్నో త్యాగాల తర్వాత తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని సీఎం అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయని సీఎం తెలిపారు. పథకాల అమలులో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందన్నారు. రైతుబంధు, రైతుబీమా చేపట్టడానికి తమకు ఏడాది కాలం పట్టిందన్నారు. తెలంగాణలో ప్రతి 5 వేల ఎకరాలకు ఒక అధికారి ఉన్నట్లు తెలిపారు. రైతు కుటుంబాలకు 10 రోజుల్లో బీమా సొమ్ము అందేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.రైతు బీమా తరహాలోనే చేనేత కార్మికులకు సహాయం అందిస్తామన్నారు. గీత కార్మికుల కోసం చెట్ల పన్నులు తొలగించాం. ఎంబీసీ వర్గాల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఒక ధనిక రాష్ట్రం. ఇది మరింత పెరుగుతుందన్నారు. జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువన్నారు. పెంచిన సంపదను పంచడం ఎలా అనే ఆలోచిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.