ఆస్తులను కాపాడుకోవడానికి కాషాయ కండువా కప్పుకొన్న ఈటలకు మోదీ బొమ్మంటేనే జడుపు, జ్వరం పట్టుకొన్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో తాను చేస్తున్న పాదయాత్రలో ఏ మూలన కూడా మోదీ బొమ్మ కనపడనివ్వవద్దని తన అనుచరులను మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించినట్టు సమాచారం. మోదీ పరిపాలన మీద దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తున్నది.
తన పాదయాత్రలో.. భవిష్యత్ ఎన్నికల ప్రచారంలో మోదీ బొమ్మ పెట్టుకొంటే వచ్చే ఓట్లు కూడా రావేమోనని ఈటల తన అనుచరుల ముందు ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది.
కరోనా వ్యాప్తి నిరోధంలో మోదీ ప్రభుత్వం విఫలం కావడం, వంటగ్యాస్ రూ.850, పెట్రోల్ లీటర్ ధర రూ.110 కి చేరుకోవడంతో మోదీ సర్కారుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉన్నది. దీంతో ఈటల మోదీ పేరెత్తితేనే భయపడుతున్నారు. బీజేపీలో చేరడంకోసం రోజుల తరబడి ఢిల్లీలో ఉండిపోయిన ఈటల ప్రధాని మోదీని కలవకపోవడం గమనార్హం. పాదయాత్రలో తన బొమ్మ తప్ప వేరే బొమ్మ కనిపించవద్దని కార్యకర్తలను ఆదేశించినట్టు సమాచారం.