టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్న పార్టీ కార్యకర్తలకు వచ్చేనెల 1 నుంచి జీవిత బీమా అమలు కాబోతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా 61లక్షల సభ్యత్వం చేయించటం ఒక ఎత్తు అయితే సభ్యత్వ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిచేయటం మరో ఎత్తు అని పేర్కొన్నారు.
ఈ ప్రక్రియను సత్వరమే పూర్తిచేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. మంగళవారం పార్టీ ప్రధాన కార్యర్శులతో పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఇంకా డిజిటలైజేషన్ పూర్తిచేయని జిల్లాలు, నియోజకవర్గాల మం త్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఈ నెల 31కల్లా డిజిటలైజ్ చేయకపోతే ప్రమాదబీమా వర్తించని పరిస్థితులున్న కారణంగా మిగిలిన డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకర్గాల్లో 61 లక్షల సభ్యత్వాల్లో దాదాపు 55 లక్షల సభ్యత్వాలకు సంబంధించి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి అయినట్టు తెలిసింది. సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ మాజీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమా భరత్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, శ్రవణ్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నూకల నరేశ్‌రెడ్డి, నరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు