తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న దళితబంధు పథకానికి సంబంధించిన అవగాహన సదస్సు నేడు జరగనుంది. ప్రగతిభవన్ వేదికగా జరిగే ఈ సదస్సు కోసం దళితబంధువులు హుజూరాబాద్ నుంచి బయలుదేరారు. ఎంపిక చేసిన 427 మందితో 16 బస్సులు హుజూరాబాద్ నుంచి పయణమయ్యాయి. ఈ బస్సులకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ పాల్గొన్నారు. పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, సాధించే లక్ష్యాలపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన అవగాహన సదస్సు జరుగనున్నది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది.
ప్రగతిభవనానికి బయలుదేరిన దళిత బంధువులు
రోజంతా జరుగనున్న ఈ భేటీలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లోని ఒకో వార్డు నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) 412 మంది పురుషులు, మహిళలు, 15 మంది రిసోర్స్ పర్సన్స్.. మొత్తం 427 మంది దళితులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో.. దళితబంధు పథక ముఖ్య ఉద్దేశం, పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణతోపాటు పథకాన్ని విజయవంతం చేయటానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వారికి అవగాహన కల్పిస్తారు. దళితబంధు రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పుకు ఏవిధంగా దోహదపడుతుంది? పైలట్ ప్రాజెక్టును హుజూరాబాద్‌లో చేపట్టిన నేపథ్యంలో ఆ ప్రాంత బిడ్డలుగా ఎట్లా లీనమై పనిచేయాలె? దళితుల సామాజిక, ఆర్థికగౌరవాన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్న దళితబంధు పథక ఉద్దేశాలేంటి? ఈ పథకాన్ని ఎట్లా దళితుల్లోకి తీసుకపోవాలె? వారి జీవితాలను వారే అభివృద్ధి చేసుకునే దిశగా ఎట్లా వారికి అవగాహన కల్పించాలె? అధికారులతో ఎట్లా సమన్వయం చేసుకోవాలె? వంటి అంశాలపై స్వయంగా సీఎం కేసీఆర్ చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు.