తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వివిధశాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో బీఆర్కే భవన్‌లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పీఎస్‌ఏ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు, దవాఖానల్లో అన్ని పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చడం, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, చిన్నపిల్లల వార్డుల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల సంఖ్యను పెంచడం, జిల్లా దవాఖానలను బలోపేతం, అప్‌గ్రేడ్ చేయడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఉన్న ఖాళీలను త్వరగా భర్తీ చేయాలన్నారు. తగినన్నిమందులు నిల్వఉండేలా చూడాలని, ల్యాబుల్లో డయగ్నోస్టిక్, బయోమెడికల్ పరికరాలు, టెస్టింగ్ కిట్లు, ఇతర నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరుచేసిన ఏడు కొత్త వైద్య కళాశాలల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ సీఐజీ వీ శేషాద్రి, డీఎంహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీఎస్‌ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, సీఎంవో ఓఎస్డీ టీ గంగాధర్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.