సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పుష్కర కాలాన్ని పూర్తిచేసుకుంది తమిళ సొగసరి శృతిహాసన్. ఈ ప్రయాణంలో తెలుగు, తమిళంతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా తనపై ఎంతో ప్రేమాభిమానాల్ని కనబరిచారని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన కెరీర్ తాలూకు అరుదైన ఫొటోల్ని షేర్ చేసింది.
శృతిహాసన్ మాట్లాడుతూ ‘సినీ ప్రయాణంలో అప్పుడే పన్నెండేళ్లు గడచిపోయాయంటే నమ్మశక్యంగా లేదు. ఎలాంటి లక్ష్యం లేకుండా చిత్రసీమలోకి అడుగుపెట్టాను. నిత్యవిద్యార్థినిలా ప్రతిరోజు కొత్త పాఠాన్ని నేర్చుకుంటూనే ఉన్నా. తొలినాటితో పోల్చుకుంటే నటిగా ఎంతో పరిణతి సాధించాననిపిస్తోంది.
అభిమానుల ఆదరణే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ ప్రయాణం ఇంకా సాగించాల్సి ఉంది. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉండాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది. ఈ ఏడాది తెలుగులో ‘క్రాక్’ ‘వకీల్‌సాబ్’ చిత్రాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది శృతిహాసన్. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తోంది.