తెలంగాణలో గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం ముఖ్య మంత్రి మానసపుత్రిక అని అన్నారు. రూ. 11 వేల కోట్లతో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.