తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్నందున యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, తక్షణమే పర్యవేక్షించాలని ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఇప్పటికే నిర్మల్ పట్టణం నీట మునిగిందని అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను, రెవిన్యూ, ఆర్ అండ్ బీ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇండ్లల్లోంచి బయటకు రావద్దని సీఎం సూచించారు. వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు.