తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్ననేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అందులో భాగంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి తెలంగాణ బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
రెండో విడత గొర్రెల పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా రూ. 5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేపట్టగా.. అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం రూ. 6 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న గొర్రెల యూనిట్‌ను అదే సంఖ్యతో కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు.
దాంతో పాటు యూనిట్ (20+1) ధరను పెంచాలని సీఎం నిర్ణయించారు.నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామంగా కృషి చేస్తోంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతూ, తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని కేసీఆర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని సీఎం స్పష్టం చేశారు.