టీకాలను భుజాలకు ఇస్తారని, అయితే కోవిడ్ టీకాలను వేయించుకున్నవాళ్లు బాహుబలులు అయినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఇవాళ ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకుని ఉంటారని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని, దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది కోవిడ్ టీకా తీసుకున్నారని, వాళ్లంతా బాహుబలులు అయినట్లు ఆయన తెలిపారు.
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని, ప్రతి ఒక్క సీఎంతో తాను చర్చించానన్నారు. ప్రపంచం అంతా మహమ్మారితో సతమతం అయ్యిందని, పార్లమెంట్లో ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరగాలన్నారు.
ప్రతి ఒక పార్టీకి చెందిన ఎంపీలు అత్యంత కఠినమై ప్రశ్నలు వేయాలని, కానీ ఆ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చేలా అనుమతించాలని ప్రధాని తెలిపారు. క్రమశిక్షణ వాతావరణంలో సమావేశాలు సాగాలన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపతం చేస్తుందన్నారు. దీని వల్ల ప్రజల్లో నమ్మకం కలిగి, అభివృద్ధి వేగవంతం అవుతుందని మోదీ చెప్పారు.