తెలంగాణ వ్యాప్తంగా ఉన్నమత్స్యకారులను ఆర్థికంగా ఆదుకొనేందుకు ప్రభుత్వమే వారి నుంచి చేపలు కొనుగోలుచేసి ‘తెలంగాణ బ్రాండ్’ పేరుతో మార్కెటింగ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపల కొనుగోలు, మార్కెటింగ్, ఎగుమతి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.
మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ పథకంతో రాష్ట్రంలో మత్స్యసంపద భారీగా పెరిగిందని అన్నారు. 2016-17లో 1.97 లక్షల టన్నులు ఉన్న చేపల ఉత్పత్తి.. 2020-21లో 3.49 లక్షల టన్నులకు పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన చేపల్లో 60 శాతం మన అవసరాలకు వినియోగిస్తుండగా 21 శాతం పశ్చిమబెంగాల్, మరో 19 శాతం చేపలను అస్సాం, తమిళనాడు, కేరళతోపాటు ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలిపారు.
మత్స్యకారులు తక్కువ ధరకే చేపలను విక్రయిస్తూ నష్టపోతున్నారని, దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వమే ‘తెలంగాణ బ్రాండ్’ పేరుతో మార్కెటింగ్ చేసే ఆలోచనలో ఉన్నదని వెల్లడించారు. ఇందులో భాగంగానే 2-3 మండలాలను ఒక క్లస్టర్‌గా మొత్తం 200 క్లస్టర్లను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు. మొదటి దశలో హైదరాబాద్‌లోని శేరిగూడ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మార్కెటింగ్ విధానంతో 500 మందికి ప్రత్యక్షంగా, 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు.