తెలంగాణ రాష్ట్రంలో 19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి అయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. 99.69 శాతం లక్ష్యం సాధించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. దీనితో పాటుగా 10 ఎకరాల్లో ఒకేచోట ప్రతి మండలానికి ఒక బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
వీటి కోసం 5300 ఎకరాల స్థలాన్ని గుర్తించి ఒక్కోదానికి రూ.40 లక్షలు కేటాయించామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా 19,472 పల్లె ప్రకృతి వనాలను తలపెట్టగా.. ఇందులో రూ.116 కోట్ల అంచనా వ్యయంతో 19,413 వనాలు సిద్ధమయ్యాయని పేర్కొన్నారు.
గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో.. పట్టణాలకు తీసిపోని విధంగా వీటిని ఏర్పాటు చేశామని, వీటికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. మిగిలిన 59 పల్లె ప్రకృతి వనాలను కూడా త్వరలో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు.