వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త తెలిపింది. ఇప్పటివరకూ బీసీ గురుకులాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచితవిద్య పొందుతుండగా, తాజాగా ఇంటర్మీడియట్ ను కూడా అక్కడే చదివేలా అన్ని ఏర్పాట్లకు సిద్ధమైంది. ఈ ఏడాది 119 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు తెలిపారు.
బీసీ గురుకులాలపై శుక్రవారం మంత్రి గంగుల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని స్వరాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలు కార్పొరేట్ సంస్థలను మైమరిపిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 261 పాఠశాలలు, 19 జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజీ సహా మెత్తం 281 గురుకులాల్లో ప్రభుత్వం సకల సౌకర్యాలను కల్పించిందన్నారు.
అన్ని బీసీ గురుకులాలు నూటికి నూరుశాతం డిజిటలైజ్ అయ్యాయని, వాటిలో విద్యా ప్రమాణాలను పెంచడంతో క్యాంపస్ రిక్రూట్మెంట్లు కూడా జోరందుకున్నాయని చెప్పారు.కమలాపూర్ గురుకులంతో సహ రాష్ట్రంలో మొత్తం 25 గురుకులాలు కార్పోరేట్ కు ధీటుగా సకల సౌకర్యాలతో ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. తెలంగాణ గురుకుల విద్యావ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.