Home / EDITORIAL / తెలంగాణలో పల్లెలకు పునర్జీవం

తెలంగాణలో పల్లెలకు పునర్జీవం

ప్రజల ఆసక్తులు, ప్రజా ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. సామాజిక చైతన్యం కొరవడిన చోట ప్రజల ఆసక్తులు కేవలం వ్యక్తిగత లబ్ధితో ముడిపడి ఉంటాయి. ఇలాంటప్పుడే పాలకులకు దీర్ఘ దృష్టి, సామూహిక చింతన, మానవీయ దృక్కోణం ఎంతో అవసరం. అలా ఉంటేనే ప్రజా ప్రయోజనాలు నెరవేర్చేపథకాలు అమల్లోకి వస్తాయి.

సమాజ సంక్షేమం కోసం, దళితులను, వెనుకబడిన తరగతుల ప్రజలను అభివృద్ధి వైపు నడిపించటం కోసం పడుతున్న తపన, ఆరాటం కేసీఆర్‌ రూపొందించిన ప్రతిప్రణాళికలో కనిపిస్తున్నది. రాష్ట్రం లో ముసలవ్వలకు రక్షణ, పసి పిల్లలకు శిక్షణ ఉన్నది. ఆరిపోని విద్యుత్‌ వెలుగులున్నయి. ఆశలు పండిన రైతు ల చిరునవ్వులున్నయి, నదులను పొలాలవైపు మళ్లించిన సజీవధారలున్నయి. ఎగిసిపడే మత్తడుల సవ్వడులున్నయి. తుళ్లిపడే చేపల సందడులున్నయి. గొర్లమందలున్నయి, గొల్లకుర్మల గుండె చప్పుడులున్నయి. సాగులో స్వర్ణయుగాన్ని తలపిస్తున్న సుశ్యామల సస్యాలున్నయి. జనాలను తిరిగి గ్రామాలవైపు నడిపిస్తున్న ప్రగతి దారులున్నయి. అంతేకాదు, సబ్బండ కులాల ఆత్మగౌరవముంది. సకల జనుల శ్రేయస్సూ ఉన్నది.

తెలంగాణ రావడానికి ముందు.. ఇప్పుడున్న పరిస్థితులకు మధ్య స్పష్టమైన అంతరం కనిపిస్తున్నది. ఆనాడు పాడుబడ్డ ఊర్లు, పడావుపడ్డ భూములుండేవి. నేడు పచ్చని పొలాల మధ్య ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేసుకుంటున్న రైతాంగం కనిపిస్తున్నది. కోతల్లేని కరెంటు, కొత్తగా అందివచ్చిన సాగునీటి సదుపాయం, సకాలంలో ఎరువులు విత్తనాలు, రైతుబంధు, పెట్టుబడి సాయం ఇంత సాయం చేస్తూనే, పండించిన చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండటం తో మునుపటి రంది లేదు. పల్లెలో ఉన్న భూమి అమ్ముకొని పట్నాలలో వాచ్‌మెన్‌ కొలువులు వెతుక్కునే దుర్గతిలో ఇప్పుడు తెలంగాణ రైతులు లేరు గాక లేరు. ఆ పీడకల అంతరించింది. ముఖ్యమంత్రి పట్టుదలతో తాను పనిచేస్తూ, యంత్రాంగాన్ని పనిచేయిస్తున్న తీరువల్ల మార్పు వచ్చింది. ఇది రైతు ప్రభుత్వం. రైతే ముఖ్యమంత్రి అయి పాలిస్తున్న ప్రభుత్వం.

సీఎం చాలా ముందుచూపు ఉన్నవారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల్ని, రైతులకు ఎదురవుతున్న కొత్త సమస్యల్ని పసిగట్టి వాటికి పరిష్కారాలను చూపుతున్నారు. సీఎం తరచూ తన వ్యవసాయక్షేత్రానికి పొయ్యేది సరదా కోసమో.. విశ్రాంతి కోసమో కాదు ఆయన అక్కడ చుట్టుపక్కల రైతులతో మాట్లాడతారు. పొలంలో పనిచేసేవాళ్ల స్థితిగతులు తెలుసుకుంటారు. క్షేత్రస్థాయిలోని వాస్తవాలను తెలుసుకోవడానికే ఆయన నిరంతరం ప్రయత్నిస్తుంటరు.

గ్రామాల్లో వ్యవసాయ కూలీల కొరత చాలా ఉంది. సీజన్‌లో నైతే రూ. 500 ఇచ్చినా కూలీలు దొరకని పరిస్థితి. వ్యవసాయ యంత్రాలను రైతులకు భారీగా అందించటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని కేసీఆర్‌ ఆలోచించారు. అధునాతన యంత్రాలను గనక సమకూరిస్తే రైతాంగం ఇంకా పెద్ద ఎత్తున దిగుబడిని సాధించగలుగుతారు. ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారు గనకనే ఫాం మెకనైజేషన్‌కు ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్దపీట వేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుకు పెద్దఎత్తున ప్రోత్సాహాన్ని ఇస్తున్నది. కానీ కేంద్రం వైఖరి మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు అడ్డుతగిలే విధంగా ఉంటున్నది. చాలా కాలంగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అసెంబ్లీ తీర్మానం సైతం చేసింది. కానీ కేంద్రం అందుకు సిద్ధంగా లేదు. దానికి కారణాలేమిటో కూడా అర్థం కావు. మరోవైపు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా కాళ్ళకు బంధం వేసినట్టు కొత్త చట్టాలు తీసుకొచ్చారు. మద్దతు ధర ఉంటుందని అంటూనే, ఎఫ్‌సీఐకి నిధులు నిలిపివేస్తున్నారు. కొత్తచట్టాలు అమలులోకి తెస్తే అనివార్యంగా అన్ని రాష్ర్టాలూ అనుసరించాల్సి వస్తది. ఈ పరిణామం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుత్సాహ పరుస్తున్నదనే చెప్పాలి. అయినా రైతు సంక్షేమం కోసం త్రికరణ శుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం కనుక ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి రైతులకు భరోసానిస్తున్నారు. వ్యవసాయం అనేది ఉమ్మడి జాబితాలోని అంశం. రాష్ర్టాలతో సంప్రదించకుండానే కేంద్రం నిర్ణయాలు తీసుకొని రాష్ర్టాల మీద రుద్దే వైఖరి సరికాదు. నిశ్చయంగా కేంద్రం ఈ వైఖరిని మార్చుకోవాలి. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో కొత్త లిఫ్టులు మంజూరు చేశారు. సాగునీటి కల్పన కోసం సీఎం ఎంత ప్రాధాన్యం ఇస్తారో దీనివల్ల మరోసారి నిరూపణ అయింది.

గత ఏడాదిలో జోరు వానలు పడ్డా కూడా చెరువులు చెక్కుచెదరలేదు. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. ఎక్కడా కట్టలు తెగడం లేదా గండి పడటం వంటి సమస్యలేవీ ఉత్పన్నం కాలేదు. మిషన్‌ కాకతీయ పనులు ఎంతో నాణ్యతతో జరిగాయని అనడానికి ఇది నిదర్శనం. తెలంగాణ జీవనానికి ఆధారభూతంగా నిలిచే గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించిన సీఎం కేసీఆర్‌ కృషి చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

టీఆర్‌ఎస్‌ పరిపాలన గురించి సంక్షేమంలో స్వర్ణయుగం అని ఎవరన్నారో కానీ చాలా సరిగ్గా అన్నారు. ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలకు తోడుగా సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ ప్రోగ్రాం అనే కొత్త పథకాన్ని వెయ్యి కోట్లతో ప్రకటించారు. దళితుల్లో ఉన్న ఆర్తిని తీర్చడానికి కొత్త పథకాలెన్నో ఈ పథకం ద్వారా రానున్నాయి. దళితుల జీవితాల్లో వెలుగులు నింపే కర్తవ్యాన్ని ప్రభుత్వం ఎప్పుడూ తలకెత్తుకుంటున్నది. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాల ద్వారా బలహీనవర్గాలకు ప్రభుత్వం పెద్ద ఎత్త్తున లబ్ధి చేకూరుస్తున్నది. ఆసరా పెన్షన్‌, కల్యాణలక్ష్మి, గురుకులాల ద్వారా అధిక శాతం ప్రయోజనాలు అందుతున్నాయి. ఇప్పుడు ఈ నూతన కార్యక్రమం నిర్దిష్టంగా దళితుల కోసమే ప్రవేశపెడుతున్నారు. మొదటి దశలో నియోజకవర్గానికి వంద దళిత కుటుంబాలను ఎంపిక చేసి ప్రతి కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలనే ఆలోచన నభూతో నభవిష్యతి. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి వెయ్యి కోట్లు కేటాయించటమే కాకుండా అవసరమైతే మరింత పెంచుతామన్నారు. ఇవి సబ్‌ప్లాన్‌ నిధులకు అదనపు కేటాయింపులని ప్రకటించటం ముదావహం.

ఈ ఆర్థిక సంవత్సరం డిజిటల్‌ సిస్టంలో భూముల సర్వేను చేపడుతున్నారు. ఎప్పుడో నిజాం కాలంలో భూముల సర్వే జరిగింది. మళ్ళ ఎన్నడూ జరగలేదు. భూముల వివరాలు మోఖా మీద ఒకతీరుగా, రికార్డుల్లో ఇంకో తీరుగా ఉండటం అనేక గందరగోళాలకు అవకాశం ఇస్తున్నది. భూముల చుట్టూ జరిగే అక్రమాలకు ఈ సర్వే తప్పకుండా అడ్డుకట్ట వేయగలుగుతుంది. ఇప్పటివరకు కట్టిన డబుల్‌ బెడ్రూం ఇండ్లల్లో నివసిస్తున్న పేదల సంతోషం గురించి ఎంత చెప్పినా తక్కువే. డబ్బు కలవారు నివసించే గేటెడ్‌ కమ్యూనిటీలకు తీసిపోని విధంగా డబుల్‌ ఇండ్ల సముదాయాలు నిర్మించారు. ‘ఇంత చక్కని ఇండ్లల్ల నివసిస్తామని మేము ఎప్పుడూ అనుకోలేదు. మాకు ఇంత గొప్ప వరం అందించినందుకు ముఖ్యమంత్రి రుణం మేమెట్లా తీర్చుకోగలం’ అని పేదలు ఆనంద భాష్పాలతో కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్నారు.

ఏ గ్రామానికి వెళ్లినా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. హరిత శోభ ఇనుమడిస్తున్నది. మౌలిక వసతుల కల్పనతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. పేదవాళ్ళు మరణిస్తే ఖననం చేయడానికైనా దహనం చేయడానికైనా ఊర్ల జాగ దొరుకని పరిస్థితి ఉండేది. ఇంతకాలం అంత్యక్రియలకు భూమి దొరుకని పేదల అసహాయతను అర్థం చేసుకున్న ఒక్క నాయకుడు లేడు. ఇవ్వాళ్ళ ఊరూరా వైకుంఠధామాలు నిర్మాణమైనాయి. గ్రామ పంచాయతీల పనితీరు మెరుగుపడింది. వారిలో బాధ్యత పెరిగింది. పల్లెల్లో పారిశుద్ధ్యం కనిపిస్తున్నది. వ్యవసాయ అవసరాలకే కాక గృహావసరాలకూ నిరాటంకంగా విద్యుత్తు సరఫరా జరుగుతున్నది. మిషన్‌ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటి సరఫరా జరుగుతున్నది. ఊరికి ట్రాక్టరున్నది. ఊరంతా అడుగడుగునా చెట్లతో పాటూ ఒక పార్క్‌ తయారవుతున్నది. ప్రతి ఊరికొక నర్సరీ ఉన్నది.

15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థల నిధుల్లో రూ.699 కోట్ల కోత విధించటం అన్యాయం. కేంద్రం చేసిన ఈ అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను కేసీఆర్‌ నెత్తిన వేసుకున్నారు. ఎందుకంటే ఆయన ప్రాణం పల్లెల్లో ఉన్నది. ఆయన జిల్లా పరిషత్‌లకు రూ.500కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ప్రకటించిన్రు. గ్రామాల అభివృద్ధికి ఏ అవరోధం ఉండవద్దని కేంద్రం బరువును మోయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడ్డది.

ప్రభుత్వ ప్రతిపాదనలు, పథకాలు అడుగడుగునా ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయి. విస్తృత పరిధిలో ప్రజాహితం కోసం పాటుపడుతున్నది. సీఎం అనేక పరిమితులను అధిగమిస్తూ చేయగలిగినంత చేస్తున్నారు. సాధించవలసింది ఇంకా చాలా ఉందని పదేపదే ప్రకటిస్తున్నారు. అది వారి వినయ సంపదకు, విశుద్ధ మనస్తత్వానికి అంకిత చిత్తానికి నిదర్శనం. విరామ మెరుగక పరిశ్రమించే క్రియాశీల ప్రభుత్వాలపై పాక్షిక వైఖరితో చేసే అలవిమాలిన విమర్శలు సమాజానికి నష్టం చేస్తాయి. విమర్శ కోసం విమర్శ అనే యాంత్రిక ధోరణిని వీడి, నిర్మాణాత్మక వైఖరితో సానుకూల దృక్పథంతో నేటి తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం విజ్ఞుల విధి.
– డి. అభిజ్ఞ

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat