సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి మండిపడ్డారు. ఆ వార్తలు తనను ఎంతో బాధపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ‘రైతన్న’ కార్యక్రమంలో నారాయణమూర్తిని ఉద్దేశిస్తూ ‘‘ఆయనకు ఇల్లు లేదు. సొంత ఆస్తి లేదు. ఎంతదూరమైనా నడిచే వెళతాడు. ఆయనను ఎవరూ ప్రశ్నించలేరు’’ అని గద్దర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే ఆ మాటలను సోషల్ మీడియా వక్రీకరించింది. ‘నారాయణమూర్తి దీనస్థితిలో ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎంతోమంది తనకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఫోన్‌లు చేయడంతో తనను మానసికంగా కుంగదీశాయని ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వీడియో ద్వారా స్పందించారు.
‘‘నా దగ్గర డబ్బు ఉంది. నేను చాలా ఆనందంగా ఉన్నా. ఏదైనా సాయం అవసరం అయితే ఇండస్ట్రీలో చాలామంది అండగా ఉంటారు. అభిమాన దేవుళ్లు గుండెల్లో పెట్టుకుని నన్ను అభిమానిస్తున్నారు. సినిమాల కోసం అప్పులు చేయడం, తీర్చడం సహజం. సినిమాలు చేసి స్థలాలు కొని ఏదో చేసే మనస్తత్వం కాదు నాది. ‘రైతన్న’ సినిమాను ఎప్పుడు విడుదల చేద్దామా అన్న ఆతురతతో ఉన్నా. నేను దీనస్థితిలో ఉన్నానంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడం చాలా బాధగా అనిపించింది.
ఇది సరైన పద్దతి కాదు. ఎక్కడెక్కడి నుంచో అభిమానులు ఫోన్లు చేసి నామీద దయ చూపిస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. మీ అభిమానానికి కృతజ్ఞతలు. ‘రైతన్న’ ఫంక్షన్‌లో గద్దర్ అన్న మాట్లాడేటప్పుడు కూడా ‘అన్నా నా దగ్గర డబ్బులున్నాయ్’ అని ఆయనతో చెప్పాను. మనశ్శాంతి కోసం పల్లెటూరిలో ఉంటున్నాను. అలాంటి వార్తలు ఎందుకు రాయరు’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు.