టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంతో పాటు పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన నల్లగొండ జిల్లా చండూరు మండలానికి చెందిన దివంగత తిరుమణి కొండల్ కుటుంబాన్ని ఆదుకుంటామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారక రామారావు అన్నారు. కొండల్ ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవలే మృతిచెందాడు.
బాధిత కుటుంబం సాయం కోరుతూ బుధవారం మంత్రి కేటీఆర్‌ను తెలంగాణ భవన్‌లో కలిసింది. తన భర్త కొండల్ 2001 నుంచి పార్టీ కోసం పనిచేశారని, ఆయన మరణంతో తమ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయినదని మృతుడి భార్య స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా స్వాతిని మంత్రి కేటీఆర్ ఓదార్చారు. తగిన సహాయం చేస్తామని తెలిపారు. సాయం విషయం పర్యవేక్షించాల్సిందిగా వెంటనే పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్‌ను మంత్రి ఆదేశించారు. కొండల్ ఇద్దరు పిల్లల విద్య విషయంలో సంపూర్ణ బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా విద్యాసాగర్ మంత్రికి తెలియజేశారు.