కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 33 డివిజన్ లలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, కమిషనర్ గోపీ (ఐఎఎస్) గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారు మరియు కార్పొరేటర్లు, కో – ఆప్షన్ సభ్యులు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయా డివిజన్ లలో భూగర్భ డ్రైనేజీ లైన్ల నిర్వహణ, మాన్ హోల్ చాంబర్స్ రిపేర్లు, నూతనంగా చేపట్టబోయే మంచి నీటి పైప్ లైన్లు, ట్రాన్స్ఫర్మర్లు, కరెంటు పోల్స్, హై మాస్ లైట్లు, పార్కుల అభివృద్ధి, చిల్డ్రెన్స్ పార్కుల అభివృద్ధి, పిల్లల ఆట సామగ్రి, పచ్చదనం పెంపు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, వైట్ టాపింగ్ రోడ్లు మరియు పెండింగ్ లో ఉన్న స్మశాన వాటికల అభివృద్ధి, వర్షాకాలంలో వరద సమస్య నుండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చెరువులు, వర్షపు నీటి నాలాల అభివృద్ధిపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ప్రతి కాలనీలో అత్యవసరమైన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపట్టబోయే పనులకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి రాబోయే కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ కేటాయించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అంబీర్ చెరువు అభివృద్ధి మరియు ఎస్.ఎన్.డి.పి కింద మంజూరైన రూ.84 కోట్ల నిధులతో వర్షపు నీటి నాలాల అభివృద్ధి పనులు వేగంగా చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. నిజాంపేట్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్ కార్పొరేషన్ గా నిలిపేందుకు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.